మ్యూల్ అకౌంట్లతో రూ.8.5కోట్ల లావాదేవీలు..13 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్‌‌

మ్యూల్ అకౌంట్లతో రూ.8.5కోట్ల లావాదేవీలు..13 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్‌‌

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సైబర్‌‌ నేరాలకు పాల్పడుతున్న 13 మందిని భద్రాద్రి జిల్లా టేకులపల్లి పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ బి.రోహిత్‌‌రాజు సోమవారం (ఆగస్టు 25) వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..జిల్లా సైబర్‌‌ సెక్యూరిటీ బ్యూరోకు రెండు రోజుల కింద వచ్చిన ఫిర్యాదులపై ఎంక్వైరీ చేసి.. టేకులపల్లి ప్రభుత్వ జూనియర్‌‌ కాలేజీ ఆవరణలో ఉన్న 13 మందిని అరెస్ట్‌‌ చేసినట్లు చెప్పారు. 

టేకులపల్లిలో మీ–సేవ సెంటర్‌‌ నడుపుతున్న బోడ శ్రీధర్‌‌కు టెలిగ్రామ్‌‌ యాప్‌‌ ద్వారా సైబర్‌‌ నేరగాళ్లు పరిచయం అయ్యారు. వారు చెప్పినట్లుగా శ్రీధర్‌‌తో పాటు మరో 12 మంది యువకులు నకిలీ డాక్యుమెంట్లతో 60 అకౌంట్లను ఓపెన్‌‌ చేసి వాటి వివరాలను సైబర్‌‌ నేరగాళ్లకు అందించారు. వారు సైబర్‌‌నేరాలకు సంబంధించిన లావాదేవీల కోసం ఈ అకౌంట్లను ఉపయోగించుకుంటూ.. వీరికి కొంత మొత్తం కమీషన్‌‌ ఇస్తున్నారు. 

ఇలా గత ఆరు నెలల్లో ఈ అకౌంట్ల ద్వారా రూ.8.5 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించామన్నారు. ఈ మేరకు మీ–సేవ సెంటర్‌‌ నిర్వాహకుడు బోడ శ్రీధర్‌‌తో పాటు బోడ రాజేశ్, రాజన్న, బానోతు జగదీశ్, తేజావత్‌‌ నరేశ్‌‌, పాలెపొంగు పవన్‌‌ కల్యాణ్‌‌, భుక్యా వీరన్న, జాటోత్‌‌ వీరన్న, నరేశ్‌‌, బోడ జంపన్న, బోడ రాజారాం, భూక్యా ప్రవీణ్, మాలోత్‌‌ ప్రవీణ్, ఉరిమళ్ల భరత్‌‌కుమార్‌‌ను అరెస్ట్‌‌ చేసి వారి వద్ద నుంచి 12 సెల్‌‌ఫోన్లు, బ్యాంకు పాస్‌‌బుక్స్‌‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

 వీరికి సంబంధించిన అకౌంట్లపై దేశవ్యాప్తంగా 108 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. అరెస్ట్‌‌ చేసిన వారిని ఇల్లెందు కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. నిందితులను పట్టుకున్న టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణతో పాటు ఎస్సై రాజేందర్, సైబర్‌‌ క్రైం సీఐ జితేందర్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.