- కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- ఎన్‌హెచ్ 65 విస్తరణ, ట్రిపుల్ ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలపై చర్చ
హైదరాబాద్, వెలుగు: ఎన్ హెచ్ 65 విస్తరణతోపాటు ట్రిపుల్ ఆర్ పనులకు సహకరించాలని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. చింతన్ శివిర్ లో పాల్గొనేందుకు గుజరాత్ వెళ్లిన కోమటిరెడ్డి సోమవారం కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు.
హైదరాబాద్- -అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, ఎల్బీనగర్– హయత్నగర్డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ మంజూరుతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను ఆయనతో చర్చించారు. రాష్ట్రంలో నేషనల్ హైవేల అభివృద్ధి, సేతు బంధన్, సీఆర్ఐఎఫ్పనులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ –ఏపీ మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయడంతోపాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను తగ్గించడం, పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం వంటి పలు కీలక ప్రాజెక్టులకు సహకరించాలని గడ్కరీని మంత్రి కోరారు.
పర్వతమాల కింద ఐదు రోప్‌వేలు మంజూరు చేయండి
పర్వతమాల పథకం కింద రూ.1,230 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రానికి ఐదు రోప్‌వే ప్రాజెక్టులకు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. యాదాద్రి ఆలయం, నల్గొండ హనుమాన్ హిల్, నాగార్జునసాగర్ –నాగార్జునకొండ, పెద్దపల్లి జిల్లా మంథని రామగిరి కోట, నిజామాబాద్ కిల్లా రామాలయం ప్రాంతాల్లో ఈ రోప్‌వేలను ప్రతిపాదించినట్లు తెలిపారు.
మియాపూర్– ఎల్‌బీనగర్ మెట్రో రైలు కారిడార్‌ను రెండో దశలో హయత్‌నగర్ వరకు పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, మెట్రోతో సమన్వయం ఉండేలా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు చోటు కల్పించాలని కోరారు.
సీఆర్ఐఎఫ్ కింద రాష్ట్రంలో 511.68 కి.మీ. పొడవుతో చేపట్టనున్న 33 హైవేల అభివృద్ధికి రూ.1,227.75 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డులోని ఉత్తర భాగానికి ఆర్థిక, కేంద్ర మంత్రివర్గ ఆమోదం త్వరగా ఇవ్వాలని కోరారు.
ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగాన్ని కూడా ఉత్తర భాగంతో సమానంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్,చీఫ్ ఇంజనీర్లు బీవీ రావు, ధర్మారెడ్డి, వసంత్ నాయక్ పలువురు అధికారులు ఉన్నారు.
