Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!

Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!

ఇంట్లో నాలుగు రకాల కూరలున్నా...పచ్చిపులుసు లేనిదే ఇళ్లల్లో భోజనం పూర్తవ్వదు. అంతెందుకు... ఇంటికి చుట్టాలొస్తే కోడికూర తెచ్చినా, యాటకూర వండినా... వాటితో పాటు పచ్చిపులుసు ఉండాల్సిందే. అంతలా ఇష్టపడతారు ఈ పులుసుని. అయితే... ఎప్పుడూ ఒకేరకంగా పులుసు కాకుండా..  వెరైటీగా రకరకాలుగా  చేసుకోవచ్చు..  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

వంకాయ పులుసు తయారీకి కావాల్సినవి:

 

  • పచ్చిమిర్చి: పన్నెండు
  • ఉల్లిగడ్డ తరుగు: అర కప్పు
  • చింతపండు పులుసు: ఒకటిన్నర కప్పు
  • చిన్న వంకాయలు: మూడు
  • ఉప్పు: తగినంత
  • నూనె: సరిపడా

తయారీ విధానం : వంకాయలను బొగ్గులు లేదా స్టవ్ మంటపై కాల్చాలి. అలాగే స్టవ్ పై  గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చిని వేగించాలి. తర్వాత ఒక గిన్నెలో వేగించిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా పిసకాలి. వంకాయలపై తొక్కు తీసి, వాటిని గిన్నెలో వేసి పప్పుగుత్తితో రుబ్బాలి. తర్వాత పులుసు, ఉల్లిగడ్డ తరుగు వేసి కలపాలి. అంతే  ఎంతో రుచికరమైన వంకాయ పులుసు రెడీ.. కావాలనుకుంటే... చివర్ లో పోపు పెట్టుకోవచ్చు.. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోద్ది...

చింతపండు పచ్చిపులుసు తయారీకి కావాల్సినవి:

 

  • చింతపండు పులుసు: ఒకటిన్నర కప్పు
  • ఉల్లిగడ్డ తరుగు:పావు కప్పు
  •  కరివేపాకు: ఒక రెమ్మ
  •  పసుపు: చిటికెడు
  • పచ్చిమిర్చి: ఐదు
  •  ఎండుమిర్చి: రెండు
  •  జీలకర్ర: పావు టీ స్పూన్
  •  ఆవాలు: పావు టీ స్పూన్
  •  నూనె: సరిపడా
  •  ఉప్పు:తగినంత
  •  కొత్తిమీర తరుగు: ఒక టేబుల్ స్పూన్


తయారీ విధానం : పచ్చిమిర్చి .. ఎండుమిర్చి, జీలకర్రను నూనె లేకుండా చిన్న మంటపై వేగించాలి. వాటన్నింటినీ రోట్లో వేసి రుబ్బాలి. రుబ్బిన మిశ్రమాన్ని చింతపండు పులుసులో వేసి కలపాలి. అందులోనే పసుపు, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేయాలి. లేదంటే నూనెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి పోపు పెట్టి పులుసులో వేయాలి. చివరగా ఉల్లిగడ్డ తరుగు వేసి కలపాలి. వేడివేడి అన్నంలో ఉత్త పులుసు పోసుకుని తింటే సూపర్ టేస్ట్... 

నువ్వుల పులుసు తయారీకి కావాల్సినవి:
 

  • నువ్వులు: అర కప్పు
  •  ఉల్లిగడ్డ తరుగు: పావు కప్పు
  • జీలకర్ర: పావు టీ స్పూన్
  •  ఆవాలు: పావు టీ స్పూన్
  • పచ్చిమిర్చి: నాలుగు
  •  కరివేపాకు: ఒక రెమ్మ
  • ఉప్పు: తగినంత
  •  పసుపు: చిటికెడు
  •  ఎండుమిర్చి: ఐదు
  •  చింతపండు పులుసు: ఒకటిన్నర కప్పు
  • వెల్లుల్లి రెబ్బలు: నాలుగు
  •  నూనె: సరిపడా

తయారీ విధానం: కట్టెల పొయ్యి లేదా గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టి నువ్వులను ఎర్రరంగు వచ్చే వరకు వేగించాలి. వేగిన నువ్వులను వేరే గిన్నెలోకి తీసుకొని, స్టవ్ మీద ఉన్న గిన్నెలో కొద్దిగా నూనె, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించాలి. తర్వాత వేగించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు వేసి రోట్లో దంచాలి. ఆ మిశ్రమాన్ని చింతపండు పులుసులో వేసి కలపాలి. పులుపు చూసుకొని  సరిపడా ఉప్పు వేయాలి. అందులోనే ఉల్లిగడ్డ తరుగు వేసి కలపాలి. మళ్లీ స్టవ్ పై గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేయాలి. పోవును పులుసులో వేసి కలపాలి. కావాలంటే చివర్ లో  పచ్చిమిర్చి తరుగు లేదా కొద్దిగా కారం వేసుకోవచ్చు.. ఇలా తయారు చేసుకున్న నువ్వుల పులుసు తింటే  చాలు.. ఎంతో హాయిగా ఉంటుంది.

►ALSO READ | ఆధ్యాత్మికం.. దేవాలయాలకు..టెక్నాలజీకి ఉన్న సంబంధం ఇదే.. !