‘పీఎం ధన్ ధాన్య’ స్కీమ్ కు ఎంపికైన 4 జిల్లాలు .. జనగామ, నారాయణపేట, గద్వాల, నాగర్కర్నూల్కు దక్కిన చోటు

‘పీఎం ధన్ ధాన్య’ స్కీమ్ కు ఎంపికైన  4 జిల్లాలు .. జనగామ, నారాయణపేట, గద్వాల, నాగర్కర్నూల్కు దక్కిన చోటు
  • దేశవ్యాప్తంగా వంద జిల్లాలను గుర్తించిన కేంద్రం
  • ఎంపికైన జిల్లాలకు వచ్చే ఆరేండ్ల వరకు ప్రత్యేక నిధులు  
  • వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి
  • ఇప్పటికే కరువు జిల్లాల కింద ఉమ్మడి పాలమూరు జిల్లాకు వంద కోట్లు మంజూరు

మహబూబ్​నగర్, వెలుగు : పీఎం ధన్​ ధాన్య కృషి యోజన స్కీమ్ (పీఎండీడీకేవై) కు తెలంగాణ నుంచి జనగామ, నారాయణపేట, గద్వాల, నాగర్​కర్నూల్​జిల్లాలు ఎంపిక అయ్యాయి. తాజాగా కేంద్రం దేశంలోని 100 జిల్లాలను ఎంపిక చేయగా రాష్ట్రం నుంచి 4 జిల్లాలకు చోటు దక్కింది. ఈ స్కీమ్ లక్ష్యం.. తక్కువ వ్యవసాయ ఉత్పాదకత కలిగిన జిల్లాల్లో ఎక్కువ ఉత్పాదకతను పెంచడం. ఇందుకు వచ్చే 6 ఏండ్లపాటు ప్రతి ఏటా కేంద్రం రూ.24 వేల కోట్లను వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు రైతుల ఆర్థికాభివృద్ధికి ఖర్చు చేయనుంది.  

జిల్లా స్థాయిలో ప్రణాళిక సమితి

ముందుగా కలెక్టర్​అధ్యక్షతన జిల్లా ధన్​ధాన్య కృషి యోజన సమితి ఏర్పాటవుతుంది. ఇందులో రైతులు, వివిధ శాఖల ఆఫీసర్లు సభ్యులుగా ఉంటారు. సమితి ఆధ్వర్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన కార్యకలాపాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రధానంగా పంటల నమూనా, స్థానిక వ్యవసాయం, పర్యావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు చేస్తారు. 

పంట వైవిధ్యీకరణ, నేల, నీటి సంరక్షణ, సహజ, సేంద్రియ వ్యవసాయ విస్తరణ, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో స్వయం సమృద్ధికి చర్యలు తీసుకుంటారు. పండ్ల తోటలు, మత్స్య సంపద, తేనె టీగల పెంపకం, పశు పోషణ పెంపుదలకు కృషి చేస్తారు. ముఖ్యంగా స్థానిక జీవనోపాధి కల్పనపై దృష్టి పెట్టి, దేశీయ ఉత్పత్తులను పెంపొందించడమే లక్ష్యంగా పని చేయాల్సి ఉంటుంది. 

ప్రణాళిక అమలుకు సమితి ఆధ్వర్యంలో మార్గనిర్దేశం చేస్తారు. జిల్లాలోని సమితి ఫురోగతిని, పనితీరు అంచనా వేయడానికి కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్స్​(కేపీఐ)లను వినియోగించి కేంద్రం ట్రాక్​చేస్తుంది. ప్రతి నెల సమితి పనితీరుపైనా సమీక్షలు చేస్తుంది.  

నాలుగు అంచెల్లో కమిటీలు 

నాలుగు అంచెల్లో కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారు. వీటిలో ఒకటి జిల్లా స్థాయి కమిటీ. రాష్ర్టస్థాయిలో మరో కమిటీ ఉంటుంది. ఇవి రెండూ కలిసి ఎంపికైన జిల్లాల్లో స్కీమ్ అమలు బాధ్యతను పర్యవేక్షిస్తాయి. జాతీయ స్థాయిలోనూ కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, ప్రభుత్వాధికారుల ఆధ్వర్యంలో మరో రెండు కమిటీలు ఏర్పాటవుతాయి. 

ఇవి వ్యూహాత్మక ప్రణాళిక, పథకం అమలు, రైతు సమస్యల పరిష్కారం, ఆన్​గ్రౌండ్​పర్యవేక్షణ బలోపేతానికి క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేస్తాయి.  స్కీమ్ పురోగతిని పర్యవేక్షించడానికి స్థానిక బృందాలను సమన్వయం చేసుకోవడానికి ప్రతి జిల్లాకు ఒక నోడల్​ఆఫీసర్​ఉంటారు.  

ఉమ్మడి పాలమూరు జిల్లాపై స్పెషల్​ఫోకస్​

రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రధానంగా కేంద్రంస్పెషల్ ఫోకస్ చేసింది. ఇందుకు మహబూబ్​నగర్​ఎంపీ డీకే అరుణ చొరవతో కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యధిక సార్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న జిల్లాలను గుర్తించేందుకు కేంద్రం చేసిన సర్వేలో 12 ప్రాంతాలను గుర్తించింది. 

ఆయా జిల్లాల్లో కరువు నివారణ చర్యలు చేపట్టేందుకు ఒక్కో జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని15వ ఆర్థిక సంఘం కేంద్రానికి సూచనలు చేసింది. దీంతో ఒక్కో జిల్లాకు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల చొప్పున మంజూరు చేసింది. ఇందులో రాష్ర్టంలోని 3 జిల్లాలు ఉండగా, ఇవి ఉమ్మడి పాలమూరులోని మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్​కావడం విశేషం. తాజాగా పీఎండీడీవైకే స్కీమ్ కు కూడా ఉమ్మడి జిల్లాలోని 3 జిల్లాలకు కేంద్రం ప్రాధాన్యం  ఇచ్చి చోటు కల్పించింది. 

ఆరేండ్ల పాటు భారీగా నిధులు 

కేంద్రం ప్రకటించిన జాబితాలో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని నారాయణపేట, గద్వాల, నాగర్​కర్నూల్ జిల్లాలు ఉండడం సంతోషం. కేంద్రానికి, ప్రధాని మోదీకి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్​కు ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్ర ఎంపిక చేసిన జిల్లాలకు వచ్చే ఆరేండ్లపాటు భారీగా నిధులు మంజూరు చేయడంతో పాటు  వ్యవసాయ రుణాలు, పరికరాలు, ఆధునీకరణ చేయనుంది.    

  - డీకే అరుణ, ఎంపీ,మహబూబ్​నగర్​–