తెలంగాణను వెంటాడుతున్న వాన గండం

తెలంగాణను వెంటాడుతున్న వాన గండం

తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష గండం పొంచి ఉంది. రాగల మూడు రోజులకు వాతవరణ పలు సూచనలు చేసింది. మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. తూర్పు రాజస్థాన్, పరిసర ప్రాంతం నుండి మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పశ్చిమ మధ్య బంగాళా ఖాతం వరకు ద్రోణి కొనసాగుతోందన్నారు. ఇది సముద్ర మట్టం నుండి 1.5 కి.మీ నుండి 3.1కి.మీ మధ్య వ్యాపించి ఉందన్నారు. ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా సముద్ర మట్టం నుండి 0.9 కి మీ వరకు ద్రోణి వ్యాపించి ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా..లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అర్ధరాత్రి సిటీని భారీ వర్షం ముంచెత్తింది. ఒంటి గంటకు ప్రాంభమైన వర్షం..తెల్లవారుజామున 4 గంటల వరకు కురిసింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ఓల్డ్ సిటీ, కోఠీ, అబిడ్స్, మలక్ పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, కాప్రా, కూకట్ పల్లి, కుషాయిగూడ, రాయదుర్గం, హిమాయత్ నగర్ లో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. చార్మినార్, పాతబస్తీ, యాకుత్ పురా, మాదన్నపేట, మొగల్ పూర్, శాలిబండ, బహదూర్ పురా, ఎల్బీనగర్ లో వర్షం దంచికొట్టింది.