లక్షల్లో జీతం.. వేల కోట్ల అవినీతి.. 25 మంది ఆఫీసర్ల అక్రమార్జనే 4,320 కోట్లు

లక్షల్లో జీతం.. వేల కోట్ల అవినీతి.. 25 మంది ఆఫీసర్ల అక్రమార్జనే 4,320 కోట్లు
  • ఇది రూ.100 కోట్లపైన ఆస్తులున్నోళ్ల లెక్క
  • మొత్తం అవినీతి లెక్కిస్తే పెద్ద అనకొండే
  • కనకవర్షం కురిపించిన కాళేశ్వరం
  • సిటీ శివారు జిల్లాల్లో ‘రెవెన్యూ’ ఫుల్
  • ఎవరు ఏసీబీకి చిక్కినా మినిమమ్ 100 కోట్లు
  • అంతా గత సర్కారులో చక్రం తిప్పినోళ్లే!
  • 56 మందిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులు

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక సామాన్యుడి బతుకు పెద్దగా మారకపోయినా.. కొందరు అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూనే గత 12 ఏండ్లలో వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారు. ఇటీవల ఏసీబీకి చిక్కిన వారిలో 100 కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టిన వారు 25 మంది ఉన్నారు. కాళేశ్వరం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖల చుట్టూ తిరిగిన ఈ అవినీతి చక్రంలో నలుగురు ఇంజినీర్ల ఆస్తులే రూ.1,000 కోట్లు ఉండడం గమనార్హం. లక్షల్లో జీతాలు ఉన్నా.. రూ.500 మొదలు ఎంత దొరికితే అంత దోచేస్తున్నారు. కాళేశ్వరం, గొర్రెల పంపిణీ స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భూదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల అక్రమ బదలాయింపులు, ఫార్ములా ఈ కార్ రేసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా పలు కీలక కేసుల్లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఈడీ) కూడా రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నది. 

2014 తర్వాత ఆనకొండలైన ఆస్తులు

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఆస్తులు 2014 తర్వాత భారీగా పెరిగాయి.  12 ఏండ్లలో 56 మంది అధికారులు ఆదాయానికి మించి కూడబెట్టారు. లంచాలు, బహుమతులు, స్థిరచరాస్తుల రూపంలో సంపాదించిన అవినీతి ఆస్తుల విలువ.. ప్రస్తుత బహిరంగ మార్కెట్‌‌లో భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండే రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌‌, ఇరిగేషన్‌‌, ట్రాన్స్‌‌పోర్ట్‌‌, పోలీసు, మున్సిపల్‌‌, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులే అవినీతి కేసుల్లో ఎక్కువగా పట్టుబడుతున్నారు. 

కాళేశ్వరం.. కాసుల వర్షం

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్ల సంపాదనే పరిస్థితికి అద్దం పడుతోంది.  నాటి ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లతో కలిసి  అక్రమాస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులు, ఇంజినీర్ ఇన్ చీఫ్‌‌(ఈఎన్సీ)లను అరెస్ట్‌‌ చేసింది.  కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ నిర్మాణ సమయంలో రిటైర్డ్‌‌ ఇంజినీర్‌‌ ఇన్‌‌చీఫ్‌‌(ఈఎన్సీ) మురళీధర్‌‌రావు, మరో ఈఎన్సీ భూక్యా హరిరాం, చొప్పదండి ఎస్సారెస్పీ డివిజన్‌‌-8 ఈఈ నూనె శ్రీధర్‌‌ కీలకంగా పనిచేశారు. టెండర్లు సహా ప్రతి పనిలో కాంట్రాక్టర్ల వద్ద పర్సెంట్‌‌,ఇతర రూపాల్లో అందినంత వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.

కాళేశ్వరం ఈఎన్‌‌సీగా చక్రం తిప్పిన మురళీధర్‌‌రావు ఆయన కుమారుడు అభిషేక్‌‌రావు కంపెనీల ద్వారా భారీ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది.ఈఈ నూనె శ్రీధర్‌‌తన కుమారుడి వివాహ వేడుకలు థాయ్‌‌లాండ్‌‌లో వైభవంగా నిర్వహించాడు. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం ప్రత్యేక విమానంలో టికెట్లు బుక్ చేశాడు. కాళేశ్వరం ఇరిగేషన్‌‌ ప్రాజెక్ట్‌‌ కార్పొరేషన్  లిమిటెడ్‌‌ డైరెక్టర్‌‌, ఎండీగా విధులు నిర్వహించిన ఈఎన్‌‌సీ భూక్యా హరిరామ్‌‌ కూడా వందల కోట్లు అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. సోదాల్లో అత్యంత ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లు, అత్యంత ప్రైమ్‌‌లొకేషన్లలోని ఓపెన్‌‌ ప్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు సహా విలువైన ఆభరణాలు.. ఇలా ఒక్కో ఇంజినీర్ వద్ద రూ.200 కోట్లకు తగ్గకుండా అక్రమాస్తులు బయటపడ్డాయి.

మార్కెట్ వాల్యూ ఇదో మంత్రం

ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో పట్టుబడుతున్న అధికారులు తాము అవినీతి చేయలేదనే వాదనను తెరపైకి తెస్తున్నారు. భూములు, ఇతర స్థిరాస్తులు కొన్నామని, వాటి మార్కెట్ విలువ పెరిగిపోయిందని, అది చట్టబద్ధమైన మార్గమేనని అంటున్నారు. 2014 తర్వాత సమకూరిన ఆస్తులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది హాట్ టాపిక్ గా మారింది. కొందరైతే బంధువులు, స్నేహితుల పేరిట ఆస్తులు కొనిపడేశారు. ఏసీబీ అటాక్స్ కు దిగడంతో అందరి ఇండ్లలోనూ టెన్షన్ నెలకొంది. బినామీల పేరిట ఉన్నఆస్తుల వివరాలను ఐటీ శాఖ పరిశీలిస్తున్నది. 

వంద కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టిన ఆఫీసర్లు వీళ్లే

అధికారి           హోదా         ఆస్తులు (రూ. కోట్లలో)
హరిరాం    ఈఎన్సీ (కాళేశ్వరం)    200
నూనె శ్రీధర్    ఈఈ (కాళేశ్వరం)    150
మురళీధర్ రావు    మాజీ ఈఎన్సీ (కాళేశ్వరం)    100
ముత్యం వెంకటరమణ     డీఈ, రెడ్కో    400  
రవీందర్‌‌    చీఫ్‌‌ ఇంజినీర్‌‌, హెచ్‌‌ఎండీఏ    90‌‌
సంకిరెడ్డి భీమారెడ్డి    డీఎస్పీ    300
సుంకరి నరహరి రావు     ల్యాండ్స్, సర్వే డీడీ    150  
మోహన్ నాయక్    ఈఎన్సీ, ఆర్ అండ్ బీ    200 
ఆనంద్ కుమార్    ఈఎన్సీ (కాళేశ్వరం పవర్)    320
సుధాకర్ రెడ్డి    సీఈ ఇరిగేషన్    270  
వెంకటేశ్వర్లు    ఎస్ఈ, ఇరిగేషన్    230
శ్రీనివాసరావు    ఈఈ (ఇరిగేషన్)    180
అనంత లక్ష్మీకుమార్    జీఎం( వాటర్ బోర్డ్)    100
మూడ్ కిషన్    డీటీసీ( రవాణా)    100 
బాలకృష్ణ ఎస్    మాజీ డైరెక్టర్ 
(టౌన్ ప్లానింగ్)    250
ఆకుల జగదీశ్వర్ రెడ్డి    సీఈ (ట్రైబల్ వెల్ఫేర్)    120 
జ్యోతి    కమిషనర్ (బండ్లగూడ)    100
కనకరాజు    డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్    130
రమేశ్ కుమార్    జేడీ, వాణిజ్య పన్నులు    150
హరి భూషణ్     ఈఈ ఆర్ & బీ    110
డీ సత్యనారాయణరావు    ఆర్టీవో, ఖమ్మం, వరంగల్    105
వీ దేవేందర్ రెడ్డి    సీపీవో, మేడ్చల్    115
పీ రాధాకృష్ణ    సబ్ రిజిస్ట్రార్, మేడ్చల్    160
బీ విఠల్    ఎస్ఈ    140
లక్ష్మీనారాయణ     అడిషనల్ కలెక్టర్    150 ‌‌‌‌    మొత్తం    4,320