గోదావరి నుంచి మంజీరా వరకు.. తెలంగాణలో మొసళ్ల మడుగుల కథ ఇదే

గోదావరి నుంచి మంజీరా వరకు.. తెలంగాణలో మొసళ్ల మడుగుల కథ ఇదే

ఒకప్పుడు అంతరించిపోయే దశలో ఉన్న మొసళ్ల సంఖ్య ఇప్పుడు చాలా పెరిగింది. ఈ నేపథ్యంలో మొసళ్ల సంరక్షణతోపాటు రాష్ట్రంలోని మొసళ్ల మడుగుల కథ ఇది.తెలంగాణలోని పలు నదుల్లో మొసళ్లు విస్తారంగా ఉన్నాయి. ఈ మొసళ్లను పరిరక్షించేందుకు తెలంగాణ అటవీశాఖ చర్యలు తీసుకుంటోంది. నదులు, సరస్సుల్లో చేపలు, కుళ్లిపోయిన మాంసాన్ని తింటూ నీటిని స్వచ్ఛంగా ఉంచేందుకు తోడ్పడుతున్నాయి మొసళ్లు. వన్యప్రాణులైన మొసళ్లు ఆవాసాలున్న కొలనులను మొసళ్ల మడుగులు అని పిలుస్తున్నారు. అభయారణ్యాలుగా, మొసళ్ల సంరక్షణ కేంద్రాలుగా ప్రకటించడంతోపాటు వీటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు అటవీశాఖ సమాయత్తం అయింది.  

మూసీ తీరంలో మగర్ లు

హైదరాబాద్ సమీపంలోని మూసీనదీ తీరంలోని అబ్దుల్లాపూర్‌‌మెట్, హయత్‌‌నగర్, చైతన్యపురి కాల్వలు లేదా నీటి వనరులలోకి మొసళ్లు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో నదుల్లో నీటి మట్టం పెరగడం వల్ల మొసళ్లు వరదనీటిలో కొట్టుకొస్తున్నాయి.హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తినప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి మొసళ్లు మూసీ నదీ ప్రవాహంలోకి కొట్టుకొస్తుంటాయి. పీర్జాదిగూడ, ప్రతాపసింగారం వంటి శివారు ప్రాంతాల్లోని పొలాల్లో, కాజ్‌‌వేల దగ్గర మొసళ్లు తరచూ ప్రత్యక్షమవుతుంటాయి. నదీతీర గ్రామాల్లోకి మొసళ్లు వచ్చి చేరుతున్నాయి. చేపల వేట, స్నానం చేయడం, పశువులను నీటికి తీసుకెళ్లడం, నది దాటడం వల్ల మొసళ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

మొసళ్ల మడుగులు..

గోదావరి, కృష్ణా నదులు, నాగార్జునసాగర్, వరంగల్, శివారం, సోన్, పాఖాల్, కిన్నెరసాని, ప్రాణహిత, మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం వంటి ప్రాంతాలు మొసళ్ల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలోని ఈ కేంద్రాల్లో 1500కు పైగా మగర్ మొసళ్లు పొదిగి పెంచారు. హైదరాబాద్‌‌లోని పెంపక కేంద్రంలో నేపాల్ నుంచి తెచ్చిన ఘరియల్ పిల్లలను, అండమాన్ అండ్ నికోబార్ దీవుల నుంచి తెచ్చిన ఉప్పునీటి మొసళ్లను కూడా పెంచారు. సహజ సిద్ధంగా ఉన్న మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మొసళ్ల సంఖ్య పెరిగింది. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్, దాని ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో కూడా మొసళ్లు ఎక్కువగా సంచరిస్తున్నాయి. కిన్నెరసాని డ్యామ్ జలాశయంలో కూడా మొసళ్లను చూడొచ్చు.

వరదల్లో వచ్చి.. 

రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్ పట్ల గ్రామ శివారులోని ఒక పెద్ద కొలనులో వరద సమయంలో చేరిన మొసళ్లు క్రమంగా 60కి పైగా పెరగడంతో మొసళ్ల మడుగుగా మారింది. గోదావరి నదిపై నిర్మించిన శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఈ మడుగు 25 ఎకరాల విస్తీర్ణముంది. కొన్ని దశాబ్దాల క్రితం గోదావరి నది వరదల సమయంలో ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ద్వారా కొన్ని మొసళ్లు ఈ చెరువులోకి కొట్టుకొచ్చాయి. కాలక్రమేణా అవి ఇక్కడే స్థిరపడి, సంతానోత్పత్తి చేసి వాటి సంఖ్యను వందలకు పెంచుకున్నాయి. గత 40 ఏళ్లలో ఈ చెరువు ఎన్నడూ ఎండిపోలేదు. వర్షపు నీటితోపాటు భూగర్భ ఊట నీరు నిరంతరం ఊరడం వల్ల మొసళ్లకు ఇది సురక్షితమైన ఆవాసంగా మారింది.  

టూరిజం స్పాట్‌‌గా గుర్తింపు

శీతాకాలంలో ఉదయాన్నే మొసళ్లు ఒడ్డుకు వచ్చి ఎండ కాచుకునే దృశ్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ కొలనుకు పంచాయతీ అధికారులు మట్టిరోడ్డు వేశారు. ఈ మడుగు చుట్టూ 20 ఎకరాల్లో వేల మొక్కలు నాటి ప్రకృతి వనంగా అభివృద్ధి చేశారు. 

మొసళ్ల పండుగ

నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్ పట్ల గ్రామ శివారుకొలనులోని మొసళ్ల పట్ల స్థానిక ప్రజల్లో ఉన్న భయాన్ని తగ్గించడానికి, వీటి సంరక్షణపై అవగాహన కల్పించడానికి మొసళ్ల పండుగను నిర్వహిస్తున్నారు. మొసళ్ల మడుగుగా పేరొందిన ఈ ప్రాంతంలో మొసళ్లపై వైల్డ్ లైఫ్ పరిశోధకుడు డాక్టర్ ఎనగందుల వెంకట్ పరిశోధనలు చేశారు. 

మంజీరా మొసళ్ల సంరక్షణ కేంద్రం

మంజీరా వన్యప్రాణుల అభయారణ్యాన్ని మొసళ్ల సంరక్షణ, పునరావాసం కోసం1978లో అభయారణ్యంగా ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడ 400 నుంచి 600 వరకు మొసళ్లు ఉన్నాయి. మంజీరా నది వెంబడి 36 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రిజర్వాయర్‌‌లో బాపనగడ్డ, సంగమగడ్డ, పుట్టిగడ్డలాంటి తొమ్మిది చిన్న ద్వీపాలు ఉన్నాయి.

శివారం క్రోకోడైల్ కన్జర్వేషన్ కేంద్రం

శివారం వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణలో మొసళ్ల సంరక్షణకు పేరొందిన కేంద్రం. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లో గోదావరి నదీ తీరాన విస్తరించి ఉంది. గోదావరి నది ప్రవాహంలో ఏర్పడిన 20 మీటర్ల లోతైన సహజ సిద్ధమైన మడుగు మొసళ్లకు ప్రధాన నివాస స్థావరం. ఇక్కడ ప్రస్తుతం 100కు పైగా మొసళ్లు ఉన్నాయి. శీతాకాలం, వేసవి కాలం ఉదయాల్లో ఇక్కడి ఇసుక తిన్నెలు, రాళ్లపై మొసళ్లు గుంపులుగా వచ్చి ఎండ కాచుకుంటాయి.

మొసళ్ల సంరక్షణకు ప్రాజెక్ట్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1976వ సంవత్సరంలో అటవీ శాఖ మొసళ్ల సంరక్షణ ప్రాజెక్ట్ చేపట్టింది. శీతాకాలంలో గోదావరి, కృష్ణా నదులు, జలాశయాల్లో మొసళ్ల జనాభా, వాటి ఆవాసాలపై సమగ్ర సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో మొసళ్లు 30 కంటే తక్కువ ఉన్నట్లు తేలడంతో సంతానోత్పత్తి కార్యక్రమాన్ని చేపట్టారు. మగర్ మొసళ్లకు అనుకూలమైన ఆవాసాలు ఉన్న నేపథ్యంలో వీటి సంఖ్య పెంచేందుకు అటవీశాఖ చర్యలు తీసుకుంది. 1977లో నెహ్రూ జూలాజికల్ పార్క్‌‌లో మొసళ్ల పెంపకం, సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అడవిలో మొసళ్ల గుడ్లను సేకరించే కార్యక్రమాన్ని నిలిపివేశారు. దీనికి బదులుగా హైదరాబాద్, నాగార్జునసాగర్, వరంగల్ కేంద్రాల్లో కృత్రిమ వాతావరణంలో సంతానోత్పత్తి జరిపి మొసళ్లను పెంచడంపై దృష్టి సారించారు. ఈ కేంద్రాలన్నింటిలో కలిపి తెలంగాణ రాష్ట్రంలో మూడు జాతులకు చెందిన మొత్తం 300కు పైగా మొసళ్లు ఉన్నాయి.1977లో ఆసియాలోనే మొదటిసారి కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిలో మొసళ్లను పెంచే కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.

మొసళ్ల సంరక్షణకు సిఫార్సులు  

తెలంగాణలోని మొసళ్ల మడుగులపై వైల్డ్ లైఫ్ ఇండియా సీనియర్ ప్రాజెక్టు అసోసియెట్ డాక్టర్ కంటె కృష్ణ ప్రసాద్ పరిశోధనలు జరిపి, తెలంగాణ అటవీశాఖకు పలు సిఫార్సులు చేశారు. తెలంగాణలోని మొసళ్ల మడుగుల్లో ప్రతి రెండు లేదా నాలుగు సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా శాస్త్రీయ గణన నిర్వహించాలి. ఈ గణన వల్ల మొసళ్ల సంఖ్య, గూళ్లు కట్టడం, పిల్లలు పొదగడం, మొసళ్ల పోకడలు, పెరుగుదలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించొచ్చు. అభయారణ్యంలో మొసళ్లకు మెరుగైన సంరక్షణ పద్ధతులను అమలు చేయడానికి, మొసళ్ల ప్రవర్తన, వలసలు, కదలికల సరళి, ఆవాస ప్రాధాన్యం, సంతానోత్పత్తిపై అధ్యయనం చేయడానికి తోకపై గుర్తులు వేసే పద్ధతి, రేడియో-టెలిమెట్రీ ట్రాకింగ్ పద్ధతులు వంటి అధ్యయనాలు నిర్వహించాలని సూచించారు. 

మొసలి - మానవ సంఘర్షణలను నియంత్రించాలి

• కాల్వలు, నదీ పరిసరాల్లో మొసళ్ల సంచారాన్ని పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలి.
• పశువులు నదిలో నీరు తాగే ప్రాంతాల్లో మొసలి నిరోధక ఆవరణలు ఏర్పాటు చేయాలి.
• అభయారణ్యంలో చేపల వేటను నియంత్రించి, వలల్లో పిల్ల మొసళ్లు చిక్కకుండా జాలర్లకు అవగాహన కల్పించాలి.
• మొసలి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీశాఖ రెస్క్యూ బృందానికి సమాచారం ఇవ్వాలి.
• మొసలిని తరిమేయడం, పట్టుకోవడం లేదా గుంపుగా చుట్టుముట్టడం ప్రమాదకరం.