ఏసీబీకి చిక్కిన వైరా ఎంవీఐ

ఏసీబీకి చిక్కిన వైరా ఎంవీఐ

వైరా, వెలుగు: ఖమ్మం జిల్లా వైరా ఎంవీఐ ఎ వరప్రసాద్​ ప్రైవేట్​ అసిస్టెంట్​ ద్వారా లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వై రమేశ్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్​కు చెందిన నాలుగు ట్రాక్టర్లు, ఐదు టిప్పర్ల ద్వారా పెనుబల్లి నుంచి ఖమ్మంకు ఇటుక తరలించేందుకు ఎంవీఐ రూ.24,800 డిమాండ్​ చేశాడు. ఈ డబ్బులను మంగళవారం ఎంవీఐ ప్రైవేట్​ అసిస్టెంట్ రాజశేఖర్​కు కాంట్రాక్టర్​ అందజేయగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈక్రమంలో రాజశేఖర్  అక్కడి నుంచి పరారయ్యాడు. అసిస్టెంట్​ వద్ద లభించిన ఆధారాలను పరిశీలించి ఎంవీఐ వరప్రసాద్​ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆఫీస్​లో సోదాలు నిర్వహించగా, ఎలాంటి ఆధారాలు లేని 52,800 నగదు దొరికినట్లు డీఎస్పీ తెలిపారు.అనంతరం ఎంవీఐ వరప్రసాద్ ను అరెస్ట్  చేసి వరంగలో కోర్టులో హాజరు పరిచారు.

సిద్దిపేట త్రీ టౌన్  ఎస్సై రిమాండ్

సిద్దిపేట రూరల్: సిద్దిపేట త్రీ టౌన్  ఎస్సై వూర్లుగొండ వెంకటేశ్వర్లును మంగళవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. గతంలో రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్  ఎస్సైగా పని చేస్తున్న సమయంలో ఇసుక లోడ్  లారీని విడిచి పెట్టేందుకు లంచం డిమాండ్  చేసి, యూపీఐ ద్వారా రూ.15 వేలు లంచం తీసుకున్నట్లు గుర్తించారు. దీనిపై ఫిబ్రవరి 28న కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, ప్రస్తుతం సిద్దిపేటలో పని చేస్తున్న ఆయనను అరెస్ట్​ చేశారు.