
- తెలుగు గంగ నుంచి 40 టీఎంసీలు తీసుకెళ్తున్నది
- బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు
- ఔట్ సైడ్ బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: కరువు సీజన్లోనూ ఏపీ అక్రమంగా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా 40 టీఎంసీల కృష్ణా జలాలను ఔట్‌సైడ్ బేసిన్‌కు తరలిస్తున్నదని తెలంగాణ వాదించింది. ట్రిబ్యునల్ కేటాయింపులు లేకపోయినా నీటిని మళ్లించుకుంటున్నదని పేర్కొన్నది. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు శుక్రవారం కూడా తెలంగాణ వాదనలు కొనసాగాయి. రాష్ట్రం తరఫున సీనియర్ అడ్వకేట్ సీఎస్.వైద్యనాథన్ వాదనలు వినిపించారు. బచావత్ ట్రిబ్యునల్ నుంచి గానీ, బ్రజేశ్ ట్రిబ్యునల్ నుంచిగానీ కేటాయింపుల్లేని మిగులు జలాలను వాడుకునేందుకు ఉమ్మడి ఏపీలో స్వేచ్ఛ ఉండదేని గుర్తు చేశారు.
మిగులు జలాల ఆధారంగా చేపడుతున్న ప్రాజెక్టుల కింద 16.3 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు ఏపీ ప్రయత్నాలు చేసిందని, ఇప్పుడు దాన్ని 26.3 లక్షల ఎకరాలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. ఇదంతా కూడా ట్రిబ్యునల్ కేటాయింపుల్లేకుండానే చేస్తున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఔట్‌సైడ్ బేసిన్ ప్రాజెక్టులకు కృష్ణా నుంచి ఒక్క చుక్క కూడా నీటిని తీసుకెళ్లకుండా చూడాలని ట్రిబ్యునల్‌ను కోరారు. అంతేగాకుండా పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హంద్రీ నీవా, వెలిగొండ ఔట్లెట్ల నుంచి ఏపీ నీటి తరలింపులపై ఆంక్షలు విధించాలన్నారు. అవార్డుకు విరుద్ధంగా ఏపీ నీటి తరలింపులను చేపట్టకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి ఆదేశాలివ్వాలని కోరారు.
ఎక్కువ కావాలంటున్నయ్..
గోదావరి నీళ్లను కృష్ణాలోకి తీసుకొస్తే.. అందులో ఎక్కువ వాటా కావాలని కర్నాటక, మహారాష్ట్ర డిమాండ్ చేస్తున్నాయని అడ్వకేట్ సీఎస్.వైద్యనాథన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ నీటిని ఎక్కువ భాగం ఔట్ సైడ్ బేసిన్‌కు తరలిస్తున్నందున కృష్ణా బేసిన్లో కొరత ఏర్పడుతున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలవరం నుంచి గోదావరి నీళ్లను కృష్ణాలోకి మళ్లిస్తే 80 టీఎంసీల వాటా పంపకాలకు సంబంధించి 1978, ఆగస్టులో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని అడ్వకేట్ గుర్తు చేశారు. ‘‘ఆ 80 టీఎంసీల్లో నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, మహారాష్ట్ర, కర్నాటకకు 35 టీఎంసీలను పంచారు.
తెలంగాణ ఇన్బేసిన్ అవసరాలకే నీళ్లను వాడుకుంటుంటే.. ఏపీ మాత్రం ఔట్‌సైడ్ బేసిన్‌కు తరలిస్తున్నది. ఆ 45 టీఎంసీలను ఔట్‌సైడ్ బేసిన్‌కు తరలించుకుండా ట్రిబ్యునల్ చూడాలి. ఇక, ఉమ్మడి ఏపీకి ఇచ్చిన 45 టీఎంసీల్లో ఎస్ఎల్బీసీకి 30 టీఎంసీలను కేటాయించేలా 1982లో జీవో 306ను జారీ చేశారు. అందుకు అనుగుణంగా 1986లో సీడబ్ల్యూసీకి ఉమ్మడి ఏపీలోనే ఎస్ఎల్బీసీ డీపీఆర్‌నూ సమర్పించారు. ఆ తర్వాత నిర్వహించిన స్టేట్ లెవెల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్‌లోనూ ఎస్ఎల్బీసీకి 30 టీఎంసీలు, తాగునీటికి 15 టీఎంసీలు కేటాయిస్తూ సిఫార్సులూ చేశారు’’ అని ట్రిబ్యునల్‌కు సీఎస్.వైద్యనాథన్ తెలియజేశారు.
ఆర్డీఎస్కు నష్టం చేస్తున్నరు
ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు నీళ్లు రాకుండా ఏపీ కుట్రలు చేస్తున్నదని అడ్వకేట్ సీఎస్.వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఆర్డీఎస్ నుంచి బచావత్ ట్రిబ్యునల్ 15.9 టీఎంసీలు కేటాయించినా సరాసరిన కేవలం 5.4 టీఎంసీలనే వాడుకుంటున్నామని పేర్కొన్నారు. ఏపీ ప్రస్తుతం నిర్మిస్తున్న స్లూయిస్‌ను మూసేయకపోవడంతో ఏపీకి నీళ్లు ఎక్కువ పోతున్నాయన్నారు. కేసీ కెనాల్ ద్వారా ఏపీ ఉద్దేశపూర్వకంగా నీటిని తరలించుకుంటున్నదని, 31.9 టీఎంసీల కేటాయింపులే ఉన్నా.. సగటున ఏటా 55 టీఎంసీల నీటిని తీసుకెళ్లిపోతున్నదని పేర్కొన్నారు.
ఉమ్మడి ఏపీలో ఆర్డీఎస్ మోడర్నైజేషన్ కోసం ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని, నిర్మాణంలో ఉన్న స్లూయిస్‌ను మూసేయాలని కోరారు. శ్రీశైలం, పులిచింతల రిజర్వాయర్లలో ఆవిరి నష్టాల్లో 11 టీఎంసీలు, 5 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, వచ్చే నెల 23 నుంచి 25 వరకు 3 రోజుల పాటు ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల వాదనలను విననున్నది. 23న తెలంగాణ వాదనలు కొనసాగనున్నాయి.