
బషీర్బాగ్, వెలుగు: ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని.. అందువల్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పోటీ చేస్తున్నదని జేఏసీ ప్రతినిధి ప్రఫుల్ రామ్ రెడ్డి ప్రకటించారు. సైఫాబాద్ లోని భాస్కర్ ఆడిటోరియంలో బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమాలోచన సమావేశం జరిగింది.
జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ మోహన్ బైరాగి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ఉద్యమ సంఘాలు, ఉద్యమ జేఏసీ, పార్టీల నేతలు, ప్రతినిధులు పాల్గొనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించకుండా కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ద కాలం అణిచివేసిందన్నారు.
నేడు ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రెండేండ్లుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి ఉద్యమకారుల సత్తా చాటుతామన్నారు.