హైదరాబాద్, వెలుగు: భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ఉద్యమకారుల హక్కులకు భంగం కలగకుండా కమిటీకి చట్టబద్ధత కల్పించాలని జేఏసీ నాయకులువిజ్ఞప్తి చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన జాయింట్ యాక్షన్ కమిటీల (జేఏసీ) ప్రతినిధులు, నాయకులతో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సోమవారం సమావేశమైంది.
ఈ భేటీలో ఎమ్మెల్సీ కోదండరామ్, విప్ అద్దంకి దయాకర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, ఎస్. రాములు నాయక్ పాల్గొని జేఏసీ నాయకుల నుంచి వినతులు స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ 250 గజాల నివాస స్థలం, ఇల్లు కట్టుకోవడానికి రూ.10 లక్షల సాయం, ఆసరా పెన్షన్, కార్పొరేట్ వైద్యం కోసం హెల్త్ కార్డులు అందించాలని జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
