అశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు : వర్షాలు, ముసురు తుఫాన్ ధాటికి అతలాకుతలమైన వ్యవసాయ క్షేత్రాలు, దెబ్బతిన్న రోడ్లు, చెరువులను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారిక కాన్వాయ్‌లను పక్కనబెట్టి నేరుగా రంగంలోకి దిగారు. బైక్‌పై గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ, బురదమయంగా మారిన కాళ్ల బాటలు, ధ్వంసమైన మట్టి రోడ్లను సైతం లెక్కచేయకుండా ప్రతి చిన్న, సన్నకారు రైతు వద్దకూ వెళ్లి పంటలు పరిశీలించి పరామర్శించారు.
ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి అశ్వారావుపేట లో తెగిపోయిన దొంతికుంట చెరువు, వెంకమ్మ చెరువు ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నష్టపోయిన పంటల అంచనాలను తక్షణమే నివేదించాలని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ధ్వంసమైన రహదారులు, చెరువుల గండ్లకు వెంటనే రిపేర్లు చేపట్టాలని చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ జూపల్లి రమేశ్‌బాబు, నాయకులు బండి పుల్లారావు, తాడేపల్లి రవి, చిన్నంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
