గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్ గా తెలంగాణ : మంత్రి శ్రీధర్ బాబు 

గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్ గా తెలంగాణ : మంత్రి శ్రీధర్ బాబు 
  • రాష్ట్రంలో ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తాం
  • ‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’ ద్వారా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
  • ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్’లో మంత్రి కామెంట్స్​ 

హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్ గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(ఎఫ్ టీసీసీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం హెచ్ఐసీసీ నోవాటెల్ లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ 2026’లో ఆయన మాట్లాడారు.

ఎగుమతుల సన్నద్ధత సూచీలో దేశవ్యాప్తంగా తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచిందన్నారు. సముద్ర తీరం లేని రాష్ట్రాల  జాబితాలో రెండో స్థానంలో ఉందన్నారు. మర్కండైజ్ ఎగుమతుల్లో దేశంలోనే ఏడో స్థానంలో నిలవడం తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి నిదర్శనమన్నారు. ‘తెలంగాణ రైజింగ్ –2047’ విజన్ లక్ష్యసాధనలో ‘లాజిస్టిక్స్’ రంగం కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడాన్ని ఒక పరిమితిగా కాకుండా, ఒక డిజైన్ అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నాని తెలిపారు.

‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’  ద్వారా రాష్ట్రంలో మెగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, డ్రై పోర్టులు, బాండెడ్ వేర్‌‌ హౌజింగ్, లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నామని వివరించారు. లాజిస్టిక్ రంగానికి అవసరమైన రెడీ టూ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ తయారీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను లాజిస్టిక్ రంగంలోనూ సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వానించారు. సదస్సులో ఎఫ్ టీసీసీఐ ప్రెసిడెంట్ ఆర్.రవి కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేకే మహేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గరిమెళ్ల, షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కమిటీ చైర్మన్ కమల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.