ఏపీ అవసరానికి మించి నీళ్లు వాడుకుంది: తెలంగాణ

ఏపీ అవసరానికి మించి నీళ్లు వాడుకుంది: తెలంగాణ
  • కృష్ణా బోర్డుకు తేల్చిచెప్పిన తెలంగాణ
  • త్రీమెంబర్​ కమిటీ సమావేశానికి డుమ్మా 

హైదరాబాద్, వెలుగు: తాగునీటి కోసం ఐదు టీఎంసీలు కావాలని కోరుతున్న ఏపీ.. నిరుడు (2022 – 23 వాటర్​ఇయర్) అవసరానికి మించి ఎందుకు నీటిని తరలించుకుందో చెప్పాలని కృష్ణా బోర్డును తెలంగాణ ప్రశ్నించింది. తాగునీటి కోసం 5 టీఎంసీలు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ ఇటీవల కేఆర్ఎంబీకి ఇండెంట్ పంపింది. దీనిపై చర్చించేందుకు మంగళవారం త్రీమెంబర్​కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు రెండు రాష్ట్రాలకు  బోర్డు ఇదివరకే సమాచారం ఇచ్చింది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్​లోకి ఇన్​ఫ్లోలే మొదలు కాలేదని.. నీళ్లే లేనప్పుడు సమావేశం ఎందుకని తెలంగాణ ప్రశ్నించింది.

తమకు ఇతర సమావేశాలు ఉండటంతో వాయిదా వేయాలని బోర్డును కోరింది. అయినా బోర్డు సమావేశం నిర్వహించేందుకే మొగ్గు చూపడంతో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్​ సమావేశానికి హాజరుకాలేదు. కేఆర్ఎంబీ మెంబర్​ సెక్రటరీ డీఎం రాయ్​పురే అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి విజయవాడ నుంచి వర్చువల్​గా పాల్గొన్నారు. తాము  ప్రతిసారి నీటిని అడుక్కోవాల్సి వస్తున్నదని, తాగునీటి కోసం 5 టీఎంసీలు డ్రా చేసుకునేందుకు వెంటనే వాటర్​ రిలీజ్​ ఆర్డర్​ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తిని మెంబర్​ సెక్రటరీ తోసిపుచ్చారు. తెలంగాణ ఈఎన్సీ సమావేశానికి హాజరుకానుందన ఆ రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండా వాటర్​రిలీజ్​ఆర్డర్​ ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఇంత కీలక సమావేశానికి తెలంగాణ ఎలా డుమ్మా కొడుతుందని ఏపీ ఈఎన్సీ ప్రశ్నించారు. 

ముందే ఎందుకు వాడుకున్నట్టు?:తెలంగాణ ఈఎన్సీ

సమావేశం ముగిసిన తర్వాత బోర్డు మెంబర్​సెక్రటరీతో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాగార్జున సాగర్​లోకి ఇప్పటి వరకు ఇన్​ఫ్లోనే లేదని, హైదరాబాద్​జంట నగరాలతో పాటు మిషన్ భగీరథ అవసరాల కోసం తమ కోటా నీటిని మాత్రమే సాగర్ లో నిల్వ ఉంచామని ఆయన గుర్తు చేశారు. సాగర్​లో ఎండీడీఎల్​కు ఎగువన 13 టీఎంసీలే ఉన్నాయని, అవి తమ తాగునీటి అవసరాలకే సరిపోతాయన్నారు. ఏపీకి తాగునీటి అవసరాలు ఉంటాయని తెలిసినప్పుడు.. ఆ రాష్ట్రం మే నెలాఖరు నాటికే నీటిని అడ్డదిడ్డంగా వాడుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాము ఏటా తెలంగాణ కోటా నీటిని సాగర్​లో నిల్వ ఉంచుకునే వాడుకుంటున్నామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే ఏపీకి నీటి విడుదలపై అభిప్రాయం చెప్తానని తెలిపారు.