దివ్యాంగుల దినోత్సవానికి 26 లక్షలు..3న జిల్లాలు, నైబర్‌‌హుడ్ కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు

దివ్యాంగుల దినోత్సవానికి 26 లక్షలు..3న జిల్లాలు, నైబర్‌‌హుడ్ కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం రూ.26.84 లక్షలు కేటాయించింది. 

ఈ మేరకు శనివారం సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) సీఈవో దివ్య.. రాష్ట్రంలోని 32 జిల్లాలు, 74 నైబర్‌‌హుడ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వారి సంఘాలతో కలిసి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి సంబంధించిన మార్గదర్శకాలను రిలీజ్ చేశారు. ఈ గైడ్ లైన్స్ ప్రకారం.. దివ్యాంగులు, వారి కుటుంబాలను నిరుపేదలుగా పరిగణించి, గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రాజెక్టులోని అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. 

గ్రామ సంఘాలు, మండల-, జిల్లా సమాఖ్యల ద్వారా వారికి అవసరమైన సహకారం అందించనున్నారు. మండల, జిల్లా స్థాయిలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఉపాధి హామీ పథకం, మెప్మా, సర్వశిక్షా అభియాన్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులతో కలిసి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ 3 నుంచి 10 వరకు వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించాలని గైడ్ లైన్స్ ద్వారా అధికారులను సీఈవో దివ్య ఆదేశించారు.