ప్రభుత్వ స్కూళ్లకు 27 స్మార్ట్‌ టీవీల అందజేత

ప్రభుత్వ స్కూళ్లకు 27 స్మార్ట్‌ టీవీల అందజేత
  • తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్(టీటీఏ) చైర్మన్ బండారు మయూర్ రెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు:  ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లను డిజిటల్ స్కూళ్లుగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్(టీటీఏ) చైర్మన్ బండారు మయూర్ రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీటీఏ సేవా డేస్-2025లో భాగంగా.. శుక్రవారం మండలంలోని 27 ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లకు 27 ఎల్ఈడీ స్మార్ట్ టీవీలను ఆయన ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూల్ విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడానికే ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లకు స్మార్ట్ టీవీలను అందజేస్తున్నామని పేర్కొన్నారు. 

ఇప్పటికే వలిగొండ, సంస్థాన్ నారాయణపూర్, పోచంపల్లి మండలాల్లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో స్మార్ట్ టీవీలను పంపిణీ చేశామన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం ఏడాది క్రితం టీటీఏ దృష్టికి తెచ్చారని, అందుకే యాదగిరిగుట్ట మండలంలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లకు స్మార్ట్ టీవీలను అందజేశామని పేర్కొన్నారు.  స్మార్ట్ టీవీల ద్వారా విద్యాబోధన ద్వారా విద్యార్థులు చదువుల్లో మరింత మెరుగ్గా రాణించే అవకాశాముందన్నారు.

 సాధ్యమైనంత ఎక్కువ స్కూళ్లకు స్మార్ట్ టీవీలను అందించి తద్వారా డిజిటల్ విద్యను పేద విద్యార్థులకు అందించడమే టీటీఏ ధ్యేయమని తెలిపారు. ఈ మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, సైదాపురం ఉప సర్పంచ్ దుంబాల వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ బీర్ల శంకర్, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, తహసీల్దార్ గణేశ్ నాయక్, ఎంపీడీవో నవీన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, టీటీఏ సేవా డేస్ కమిటీ అధ్యక్షుడు నవీన్ రెడ్డి, కోఆర్డినేటర్ విశ్వ, ఇండియా సేవా డేస్ కోఆర్డినేటర్ మధుకర్ రెడ్డి, సేవా డేస్ అడ్వైజర్ డాక్టర్ ద్వారకాంతా రెడ్డి, టీటీఏ ప్రతినిధులు, స్కూల్ స్టాఫ్ తదితరులు ఉన్నారు.