- ఆర్డీఎస్‌ను విజిట్ చేసిన కృష్ణా రివర్ బోర్డు అధికారులు
- 30 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించాలన్న అలంపూర్ రైతులు
గద్వాల/అయిజ, వెలుగు: కర్నాటక రాష్ట్రంలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) ఆనకట్టను మంగళవారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ సుభాన్స్ బిశ్వాస్, మెంబర్ కేకే జంగిడితో పాటు ఏపీ, కర్నాటక, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మూడు రాష్ట్రాల సాగునీటి వాటా, విడుదలవుతున్న నీరు, పెండింగ్ పనులు, కాలువల స్థితిగతులు, డైవర్షన్ స్కీమ్ పనితీరును క్షేత్రస్థాయిలో సమీక్షించారు. అనంతరం మూడు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో ఆర్డీఎస్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కేటాయించిన నీటి వాటా, ప్రతి ఏడాది విడుదలవుతున్న నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాల మధ్య నీటి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా నీటిని విడుదల చేయాలని సూచించారు.
తెలంగాణకు అన్యాయం..
ఈ సందర్భంగా ఆర్డీఎస్ ఆయకట్టు కమిటీ మాజీ చైర్మన్ తనగల సీతారాంరెడ్డి, అలంపూర్ రైతులు కేఆర్ఎంబీ బృందానికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ఆర్డీఎస్ ఆయకట్టుకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఆర్డీఎస్ పరిధిలోని 1, 2 ప్యాకేజీ పనులు పూర్తి కాకపోవడంతో పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదన్నారు. 15.9 టీఎంసీల నీటి వాటాతో 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, గత 30 ఏళ్లుగా 5 నుంచి 7 టీఎంసీల నీరు మాత్రమే అందుతోందని, 30 వేల ఎకరాలకు మించి సాగు కావడం లేదని తెలిపారు.
తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలైన నీరు ఆర్డీఎస్ మీదుగా ప్రతి ఏడాది 200 నుంచి 400 టీఎంసీలు శ్రీశైలం డ్యాంకు వెళ్తోందన్నారు. ఆర్డీఎస్ పరిధిలో తుంగభద్ర నుంచి వచ్చే వరద నీటిని నిల్వ చేసుకునేందుకు 30 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని రైతులు కోరారు. అలాగే కర్నాటక, ఏపీ రాష్ట్రాలు అక్రమంగా లిఫ్టులు ఏర్పాటు చేసుకోవడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు.
75 ఏళ్ల క్రితం నిర్మించిన ఆర్డీఎస్ స్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతిన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్‌ను తుంగభద్ర బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కోరారు. పెండింగ్ పనులు పూర్తి చేసి అలంపూర్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు డిస్ట్రిబ్యూటర్-40 వరకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్డీఎస్ నీటికి కర్నాటక ఎసరు..
ఆర్డీఎస్ నీటికి కర్నాటక ఎసరు పెడుతోందని తెలంగాణ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆనకట్టకు 100 మీటర్ల దూరంలో డ్రింకింగ్ వాటర్ పేరుతో కొత్త లిఫ్ట్ ద్వారా 2 టీఎంసీల నీటిని తరలించేందుకు స్ట్రక్చర్ నిర్మాణం చేపట్టిందని తెలిపారు.
రాజోలి బండ ఆనకట్ట సమీపంలో కర్నాటక సర్కార్ రూ.85 కోట్లతో కురిడి డ్రింకింగ్ వాటర్ పేరుతో మరో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేస్తోందని, పనులు దాదాపు 50 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఆనకట్టకు అతి సమీపంలో ఈ పనులు సాగుతుండటంపై తెలంగాణ ఆర్డీఎస్ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆర్డీఎస్ కాలువ ద్వారా తెలంగాణ ఆయకట్టుకు 5 నుంచి 7 టీఎంసీల సాగునీరు మాత్రమే అందుతోందని, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పేరుతో కర్నాటక మరో 2 టీఎంసీల నీటిని మళ్లిస్తే తెలంగాణకు వచ్చే నీరు మరింత తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
