ఆర్‌‌ఎంసీ మీటింగ్‌‌లో తెలంగాణ, ఏపీ ఏకాభిప్రాయం

ఆర్‌‌ఎంసీ మీటింగ్‌‌లో తెలంగాణ, ఏపీ ఏకాభిప్రాయం
  • తాగు, సాగునీటి అవసరా లుంటేనే కరెంట్‌‌ ఉత్పత్తి
  • రెండు రాష్ట్రాలకు రికమండేషన్స్‌‌ రిపోర్ట్‌‌ అందజేత
  • సంతకాల కోసం మళ్లీ సోమవారం ఆర్‌‌ఎంసీ భేటీకి నిర్ణయం
  • తేలని నాగార్జునసాగర్‌‌ ఆపరేషన్‌‌ ప్రొటోకాల్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు, కరెంట్‌‌ చెరిసగం పంచుకుందామని తెలంగాణ, ఏపీ ఏకాభిప్రాయానికి వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన తాగు, సాగునీటి అవసరాలుంటేనే కరెంట్‌‌ ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. శనివారం జలసౌధలో కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌, ఆర్‌‌ఎంసీ కన్వీనర్‌‌ రవికుమార్‌‌ పిళ్లై అధ్యక్షతన రిజర్వాయర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కమిటీ చివరి సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకే మీటింగ్‌‌ ప్రారంభం కావాల్సి ఉన్నా.. తెలంగాణ సభ్యులు హాజరుకాకపోవడంతో మధ్యాహ్ననికి వాయిదా వేశారు. లంచ్‌‌‌‌ తర్వాత మొదలైన సమావేశానికి కేఆర్‌‌‌‌ఎంబీ మెంబర్‌‌‌‌ (పవర్‌‌‌‌) మౌన్‌‌‌‌తంగ్‌‌‌‌, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్‌‌‌‌, నారాయణరెడ్డి, రెండు రాష్ట్రాల జెన్‌‌‌‌కో అధికారులు హాజరయ్యారు. కన్వీనర్‌‌‌‌ రవికుమార్‌‌‌‌ పిళ్లై మొదట ఆర్‌‌‌‌ఎంసీ రికమండేషన్స్‌‌‌‌ను వివరించారు. దీనిపై 2 రాష్ట్రాల ఇంజనీర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌‌‌ ప్రాజెక్టుల ఆపరేషన్‌‌‌‌ ప్రొటోకాల్‌‌‌‌ (రూల్‌‌‌‌ కర్వ్స్‌‌‌‌), పవర్‌‌‌‌ జనరేషన్‌‌‌‌, ప్రాజెక్టులన్నీ నిండి నీళ్లు సముద్రంలోకి పోయే రోజుల్లో వినియోగించుకున్న నీటి లెక్కింపు విధానంపై ఎవరి వాదనలు వారే వినిపించారు. కన్వీనర్‌‌‌‌ జోక్యం చేసుకొని రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేలా ప్రాజెక్టుల్లోని నీటిని వినియోగించుకునే ప్రతిపాదనపై ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. శ్రీశైలం విషయంలో ఈ ప్రపోజల్‌‌‌‌కు రాష్ట్రాలు ఓకే చెప్పాయి. నాగార్జునసాగర్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ ప్రొటోకాల్‌‌‌‌ అంశాన్ని సీడబ్ల్యూసీ వద్దే తేల్చుకోవాలని నిర్ణయించాయి. సమావేశం తర్వాత ఆర్‌‌‌‌ఎంసీ రికమండేషన్స్‌‌‌‌తో కూడిన రిపోర్టును రెండు రాష్ట్రాల సభ్యులకు కన్వీనర్‌‌‌‌ అందజేశారు. వాటిపై రెండు రాష్ట్రాల సభ్యులు సంతకాలు చేయకపోవడంతో సోమవారం మధ్యాహ్నం 2.30కు మళ్లీ సమావేశమై చర్చించాలని నిర్ణయించారు.

ప్రతీ చుక్కను లెక్కలోకి తీసుకోవాలి..

శ్రీశైలంలో జూన్‌‌‌‌ నుంచి అక్టోబర్‌‌‌‌ నెలాఖరు దాకా 854 అడుగుల లెవల్‌‌‌‌లోనే సాగునీటి అవసరాలు, కరెంట్‌‌‌‌ ఉత్పత్తికి నీటిని వినియోగించుకోవాలి. తాగునీటి అవసరాలపై ప్రభావం పడకుండా శ్రీశైలం నీటిని ఉపయోగించుకోవాలి. శ్రీశైలంలోకి చేరే నీళ్లలో 75% నీటిని రెండు రాష్ట్రాలు తమ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలి. తెలంగాణ భూభాగంలోకి చేరిన ప్రతి చుక్కా కృష్ణా నీటిని లెక్కలోకి తీసుకోవాలి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌‌‌, పులిచింతల సహా ప్రకాశం బ్యారేజీల గేట్లు ఎత్తినప్పుడు రెండు రాష్ట్రాలు వినియోగించుకునే నీటిని లెక్కించినా, వాటిని ఆయా రాష్ట్ర కేటాయింపుల్లో చేర్చొద్దు. ఏ రాష్ట్రం ఎంత మేరకు మిగులు నీటిని తీసుకున్నదనే అంశాన్ని పీఆర్‌‌‌‌ఎంసీ ఎప్పటికప్పుడు మానిటరింగ్‌‌‌‌ చేస్తుంది. ఈ నివేదికను బోర్డు ఆమోదం కోసం పంపిస్తారు. బ్రిజేశ్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ (కేడబ్ల్యూడీటీ -2) అమల్లోకి వచ్చి ఆ సిఫార్సుల మేరకు నీటి పంపకాలకు రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపే వరకు మాత్రమే ఆర్‌‌‌‌ఎంసీ సిఫార్సులు అమల్లో ఉంటాయని నిర్ణయించారు.

ఏకాభిప్రాయానికొచ్చారు..: రవికుమార్‌‌‌‌ పిళ్లై 

శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషన్‌‌‌‌ ప్రొటోకాల్‌‌‌‌ (రూల్‌‌‌‌ కర్వ్స్‌‌‌‌)పై తెలంగాణ, ఏపీ ఏకాభిప్రాయానికొచ్చారు. నాగార్జునసాగర్‌‌‌‌ రూల్‌‌‌‌ కర్వ్స్‌‌‌‌ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సీడబ్ల్యూసీ వద్దే తేల్చుకోవాలని రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. సోమవారం మళ్లీ భేటీ అవుతాం. పవర్‌‌‌‌ జనరేషన్‌‌‌‌, పోతిరెడ్డిపాడు నుంచి 34 టీఎంసీలు తీసుకోవాలన్న తెలంగాణ ప్రతిపాదనపై చర్చించాం. రూల్‌‌‌‌ కర్వ్స్‌‌‌‌పై వివాదాల్లోకి వెళ్లొద్దని రెండు రాష్ట్రాలు డిసైడ్​ అయ్యాయి. ఇది పూర్తిగా టెక్నికల్‌‌‌‌ అంశం. సోమవారం దాకా ఇదే పరిస్థితి ఉంటుందని ఆశిస్తున్నాను.

ఆర్‌‌‌‌ఎంసీ రికమండేషన్స్‌‌‌‌ ఇవి..

శ్రీశైలంలోని లెఫ్ట్‌‌‌‌ (తెలంగాణ), రైట్‌‌‌‌ (ఏపీ) పవర్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ల ద్వారా ఉత్పత్తి చేసే కరెంట్‌‌‌‌ను చెరిసగం పంచుకోవాలని సూచించింది. పది రోజులకోసారి రెండు రాష్ట్రాలు ఉత్పత్తి చేసిన కరెంట్‌‌‌‌ను లెక్క తీస్తారు. ప్రాజెక్టులన్నీ నిండిపోయే రోజుల్లో ప్రతీ రోజు ఉత్పత్తిని లెక్కగడతారు. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన తాగు, సాగు నీటి అవసరాలుంటేనే రెండు రాష్ట్రాలు కరెంట్‌‌‌‌ ఉత్పత్తి చేయాలి. ఒక టీఎంసీ అవసరం ఉంటే.. తెలంగాణ 0.53 టీఎంసీలు, ఏపీ 0.47 టీఎంసీల నీటిని వినియోగించి కరెంట్‌‌‌‌ ఉత్పత్తి చేయాలి. కరెంట్‌‌‌‌ ఉత్పత్తి, ఇరిగేషన్‌‌‌‌ అవసరాలను పర్యవేక్షించేందుకు పర్మినెంట్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కమిటీ (పీఆర్‌‌‌‌ఎంసీ)ని ఏర్పాటు చేయాలని బోర్డుకు ఆర్‌‌‌‌ఎంసీ ప్రతిపాదిస్తుంది. ఆ కమిటీ పది రోజులకోసారి పవర్‌‌‌‌ జనరేషన్‌‌‌‌, ఇరిగేషన్‌‌‌‌ నీటి విత్‌‌‌‌డ్రాల్స్‌‌‌‌ను పర్యవేక్షిస్తుంది. తెలంగాణలోని లెఫ్ట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ పవర్‌‌‌‌ హౌస్‌‌‌‌కు రివర్సబుల్‌‌‌‌ టర్బైన్‌‌‌‌లు ఉండటంతో కరెంట్‌‌‌‌ ఉత్పత్తి కోసం పీక్‌‌‌‌ అవర్స్‌‌‌‌లో వదిలిన నీటిని డిమాండ్‌‌‌‌ తక్కువ ఉన్న టైంలో తిరిగి రిజర్వాయర్‌‌‌‌లో పోయాలి. ఏపీకి ఈ ఫెసిలిటీ లేకపోవడంతో రివర్సబుల్‌‌‌‌ పంపింగ్‌‌‌‌ కోసమయ్యే ఖర్చును ఆ రాష్ట్రం భరించాలి.