
- రూ. 4 వేల కోట్ల బకాయిల వివాదం తేల్చాలని తెలంగాణ, ఏపీ లేఖలు
- రెండుమూడు నెలల్లో పరిష్కారం అవుతుందని అధికారుల ధీమా
తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న కరెంటు బకాయిల వివాదం కంప్ట్రోలర్ అండ్ ఆడి టర్ జనరల్(కాగ్)కు చేరింది. వివాదాన్ని పరిష్కరించాలంటూ ఇరు రాష్ట్రాలు కాగ్‌ను ఆశ్రయించాయి. రాష్ట్ర విభజన జరిగి ఐదేండ్లు దాటినా విద్యుత్ వివాదాలు పరిష్కారం కాలేదు. ఇటీవల పలు దఫాలు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. తెలంగాణ తమకు బాకీ ఉన్నట్లు ఏపీ విద్యుత్ సంస్థల అధికారులు.. లేదు ఏపీయే తమకు బకాయి ఉందని తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులు ఒకరిపై ఒకరు ప్రకటనలు చేసుకుంటున్నారు. ఏపీ అధికారులు ఏకంగా కంపెనీ చట్టానికి అనుగుణంగా పిటిషన్ వేశారు. అయితే తాజాగా జరిగిన అధికారుల సమావేశంలో అనేక వాదనల తర్వాత రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య రూ. 4,000 కోట్ల బకాయిలకు సంబంధించిన లెక్కలకు పరిష్కారం లభించలేదు. ఈ లెక్కల వివాదాన్ని తేల్చేందుకు కాగ్‌ను ఆశ్రయించాలని రెండు రాష్ట్రాల అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాగ్‌కు వారు లేఖలు రాశారు. ఆడిట్ ద్వారా రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు సంబంధించిన లెక్కలు తేల్చి, అప్పులు ఎన్ని, బకాయిలు ఎన్ని, ఎవరు ఎంత బకాయిలు ఉన్నారో కాగ్ వెల్లడించనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కాగ్ లెక్కలు తేలిస్తే రెండు రాష్ట్రాలకు ఇబ్బంది ఉండదని అధికారులు అంటున్నారు. విద్యుత్ సంస్థల చిట్టాను కాగ్ ముందు పెడితే రెండు మూడు నెలల్లోనే వివాదం పరిష్కారమయ్యే చాన్స్ ఉందని చెబుతున్నారు.
కంపెనీ చట్టమా.. విభజన చట్టమా..
కరెంటు బకాయిల వివాదాన్ని రెండు ప్రభుత్వాల మధ్య వివాదంగా కాకుండా కంపెనీల మధ్య వివాదంగా భావించాలని తెలంగాణ అధికారులు అంటున్నారు. కంపెనీ యాక్ట్ ప్రకారం ఆదాయాలు, అప్పులు తేల్చాలని పట్టుబడుతున్నారు. ఏపీ అధికారుల మాత్రం విభజన చట్టం ఆధారంగా.. ఆదాయం అప్పులు వివరాలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.