- హీరోషిమా ప్రతినిధులకు స్వాగతం పలికిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: జపాన్ దేశంలోని హీరోషిమా రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందం శుక్రవారం శాసనసభ, శాసన మండలిని సందర్శించింది. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ జపాన్ ప్రతినిధులకు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు.
ఉభయ సభలను తిలకించిన అనంతరం ప్రతినిధుల బృందం మండలి చైర్మన్ ఛాంబర్‌లో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని తెలిపారు.
రాజధాని హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగిందని, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలకు చెందిన ప్రజలు నివసిస్తూ తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతతో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. చట్టసభల్లో చట్టాల రూపకల్పనలో సభ్యులు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
హీరోషిమా బృందం తెలంగాణను సందర్శించడం శుభపరిణామమని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో శాసన మండలి విప్‌లు అద్దంకి దయాకర్, వెంకట నర్సింగరావు, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు టి. రామ్మోహన్ రెడ్డి, పాల్వాయి హరీశ్ పాల్గొన్నారు. వీరితో పాటు మండలి సెక్రటరీ నర్సింహాచార్యులు, శాసనసభ సెక్రటరీ ఆర్. తిరుపతి తదితరులు ఉన్నారు.
