
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 9వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 13 వరకు అసెంబ్లీ కొనసాగే సూచనలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయన్న ఊహాగానాలకు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. సెప్టెంబర్ 9వ తేదీ.. సోమవారం నాడు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. అదేరోజు శాసన సభ, శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేస్తోంది.
జులై 5న కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో… రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.
ఆగస్ట్ 27న క్యాంప్ ఆఫీస్ లో సమావేశం అయినప్పుడు… సెప్టెంబర్ 4, 9, 14 తేదీల్లో ఏదో ఒకరోజున అసెంబ్లీ సెషన్ ప్రారంభ తేదీని ఖరారుచేయాలని ఇప్పటికే అధికారులకు సీఎం సూచించారు. 2న వినాయక చవితి పండుగ, 23న స్పీకర్ పోచారం టూర్ ఉండటంతో.. 9వ తేదీని ఖరారు చేసినట్టుగా సమాచారం.
ఈ మధ్యాహ్నం రాజ్ భవన్ కు వెళ్లారు సీఎం కేసీఆర్. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. గవర్నర్ గా టర్మ్ పూర్తిచేసుకున్న నరసింహన్ తో సమావేశమయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ షెడ్యూల్, పరిపాలన అంశాలపైనా చర్చించారు.