సెప్టెంబర్ 14 నుంచి అసెంబ్లీ?

సెప్టెంబర్ 14 నుంచి అసెంబ్లీ?

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 14 (శనివారం) నుంచి సభా సమావేశాలను ప్రారంభించేందుకు సీఎం ఓకే చెప్పినట్టు సమాచారం. మొదటి రోజే బడ్జెట్​ను పెట్టేందుకు ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బడ్జెట్​ సమీక్ష సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలపై చర్చించారు. సెప్టెంబర్​ 4, 9, 14వ తేదీలు సభను ప్రారంభించేందుకు అనువుగా ఉన్నాయని అసెంబ్లీ సెక్రటరీ సూచించారు. దీంతో 14వ తేదీకే సీఎం కేసీఆర్​ మొగ్గు చూపారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు బడ్జెట్​ పెట్టాక తర్వాతి రోజు ఆదివారం సెలవు ఇస్తారని, సోమవారం నుంచి వారం పాటు నాన్​స్టాప్​గా సమావేశాలు జరుగుతాయని అధికారులు అంటున్నారు. బడ్జెట్​పై చర్చతోపాటు మున్సిపల్​ ఆర్డినెన్స్​ను సభలో ప్రవేశపెట్టనున్నారు. జులై 18, 19వ తేదీల్లో మున్సిపల్​ బిల్లు కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. బిల్లుపై గవర్నర్​ అభ్యంతరం చెప్పడంతో దాన్ని పక్కనపెట్టేసి ఆర్డినెన్స్​ తెచ్చారు. దీంతో ఆ ఆర్డినెన్స్​ను ఈ సమావేశాల్లో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త రెవెన్యూ చట్టం అనుమానమే

బడ్జెట్​ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం ప్రవేశపెడతామని సీఎం కేసీఆర్​ రిపబ్లిక్​ డే ప్రసంగంలో చెప్పారు. అయితే, ఇప్పటిదాకా రెవెన్యూ శాఖలో బిల్లుపై ఎలాంటి కసరత్తు చేయలేదు. చట్టం ఎలా ఉండాలి.. అందులో ఏముండాలన్న విషయాలపై అధికారులకు సీఎం ఎలాంటి సూచనలు చేయలేదని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కసరత్తు మొదలుపెట్టినా కనీసం నెల బిల్లు రెడీ అవడానికి నెల పడుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో సుమారు 151 పాత చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటన్నింటినీ మార్చి ఇప్పటికిప్పుడు కొత్త చట్టం తీసుకురావడం అసాధ్యమంటున్నాయి. ఈ సమావేశాల్లో బిల్లు అసెంబ్లీ ముందుకు వచ్చే అవకాశం లేదని చెపుతున్నాయి. అయితే బయటి వ్యక్తులతో రహస్యంగా బిల్లును తయారు చేయిస్తున్నారని కొందరు అధికారులు అనుమానిస్తున్నారు.

సీరియస్​గా తీసుకోకండి

సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినం సందంర్భంగా బీజేపీ నేతలు ఆందోళనలు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్​, ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్వహించనున్న విమోచన దినానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అతిథిగా వస్తున్నారు. దీంతో ఆ రోజు అసెంబ్లీ సమావేశాలుంటే, బీజేపీ నేతలు అసెంబ్లీని ముట్టడించే అవకాశం ఉంటుందని కొందరు టీఆర్​ఎస్​ నేతలు సీఎం వద్ద ప్రస్తావించారని సమాచారం. అందుకు ఆయన, విమోచనం దినం రోజు బీజేపీ చేసే ఆందోళనలను అంత సీరియస్​గా తీసుకోవద్దని వారికి సీఎం సూచించినట్టు సమాచారం.