- వివరాలను వెల్లడించిన
- సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు
- మెట్రో స్వాధీన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
- ఫేజ్ 2, 3 ప్రపోజల్స్ ను కేంద్రానికి పంపించామని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ ఎం ఆర్ ఎల్) ఫేజ్ 1 ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి స్వాధీనం చేసుకునే పక్రియను, రెండో, మూడో దశ విస్తరణ ప్రాజెక్టులను సభకు వివరించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)కు మెట్రో నెట్ వర్క్ విస్తరించాలనే వివిధ వర్గాల డిమాండ్ మేరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. “మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను, ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం లోతుగా సమీక్షించింది. ప్రస్తుతమున్న మెట్రో ఫేజ్ 1 మొత్తం 69 కిలోమీటర్లు. ఫేజ్ 2(ఏ) 76.4 కిలోమీటర్లు, ఫేజ్ 2 (బీ) 86.1 కిలోమీటర్ల మేర విస్తరణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితిని సభ ముంచుంచింది. ఫేజ్ 1 ప్రైవేట్ నిర్వహణలో ఉండగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఫేజ్- 2 ప్రభుత్వ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఎదురవుతున్న సాంకేతిక, చట్టపరమైన, నిర్వహణ సమస్యలను దృష్టిలోకి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన ఆంశాలను పరిష్కరించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో ఫేజ్ 1 నెట్‌వర్క్ ను రాష్ట్ర ప్రభుత్వం హెచ్ ఎం ఆర్ ఎల్ ద్వారా స్వాధీనం చేసుకునే నిర్ణయాన్ని ఈ సభ ఆమోదిస్తుంది. అందువల్ల.. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం చేసుకునే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థించి, పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. ఫేజ్- 2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం త్వరగా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేయాలని ఈ సభ కోరుతోంది”అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మాకు అవకాశం ఎందుకు ఇవ్వరు? : మంత్రి హరీశ్ రావు
మెట్రో స్వాధీన తీర్మానంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వకుండా సభ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఎలా ప్రకటిస్తారని బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. కీలక ప్రాజెక్టు స్వాధీనం చేసుకునే తీర్మానం విషయంలో ప్రధాన ప్రతిపక్షానికి ఎందుకు అవకాశం ఇవ్వరని ఆయన ఫైరయ్యారు.
15 వేల కోట్లతో ఒప్పందం : మంత్రి శ్రీధర్ బాబు
మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్– 1 లో భాగంగా ఎల్ అండ్ టీతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లతో ఒప్పందం చేసుకుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ తీర్మానాన్ని సీఎం ప్రవేశపెట్టడానికి ముందు ప్రాజెక్టు వివరాలను మంత్రి వెల్లడించారు. “ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్ టీ ఎం ఆర్ హెచ్ ఎల్ )లోని ఈక్విటీని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ ఎం ఆర్ ఎల్) ద్వారా కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం రూ.22,102 కోట్లుగా మెట్రో ప్రాజెక్టు విలువను ఖరారు చేశారు. వచ్చే నెల 30 లోగా స్వాధీన ప్రక్రియ పూర్తి కానుంది. ఫేజ్-1 ప్రైవేట్ హ్యాండ్‌లో ఉండటం వల్ల ఫేజ్-2కు కేంద్రం “డెఫినిటివ్ అగ్రిమెంట్”సీమ్‌లెస్ ఇంటిగ్రేషన్‌ను షరతు పెట్టింది. ఎల్ అండ్ టీ ఫేజ్-2లో ఈక్విటీ పార్ట్నర్గా డెఫినిటివ్ అగ్రిమెంట్‌కు సహకరించడానికి నిరాకరించడంతో, ప్రభుత్వం ఫేజ్-1ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ అడ్డంకులు తొలగిపోతాయి. ఫేజ్ 2 లో 5 కారిడార్లను 76.4 కిమీ విస్తీర్ణంలో రూ. 24,269 కోట్లు ఖర్చు అవుతుందని, ఫేజ్ –2 మరో కారిడార్ లో 3 రూట్లలో 86.1 కిమీ విస్తీర్ణంలో రూ.19,579 కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేశాం. హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్ పొడవులో దేశంలో ఒకప్పుడు 2వ స్థానంలో ఉండగా, విస్తరణ లేమితో 9వ స్థానానికి పడిపోయింది. ఫేజ్-1కి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, నగర వృద్ధికి అనుగుణంగా విస్తరణ అవసరం”అని మంత్రి వెల్లడించారు.
