ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం.. డిసెంబర్‌ 3న తేలనున్న ఫలితాలు

ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం..  డిసెంబర్‌ 3న తేలనున్న ఫలితాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తైంది. అక్కడక్కడ చెదురుమదరు ఘటనలు జరిగాయి. ఎన్నికల్లో పోటీ చేసిన 2 వేల 290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. డిసెంబర్‌ 3వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 119 నియోజకవర్గాలకుగాను 119 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలు ఉన్న పది నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న నియోజకవర్గాల్లో లెక్కింపులో జాప్యం జరగకుండా ఉండేందుకు అధికంగా టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కూకట్‌పల్లి, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో 400లకుపైగా పోలింగ్‌ కేంద్రాలు ఉండటంతో ఈ నియోజకవర్గాల్లో 20+1 టేబుళ్లు, రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం, కూకట్‌పల్లి, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో 500లకుపైగా పోలింగ్‌ కేంద్రాలు ఉండడంతో ఈ నియోజకవర్గాల్లో 28+1 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

పోస్టల్‌ బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈవీఎంల కౌంటింగ్‌ పూర్తయ్యేలోగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కూడా పూర్తిచేసేలా ప్లాన్‌ చేసింది. ఇందుకోసం 500 ఓట్లకు ఒకటి చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకుంటే, చివరి రౌండ్‌ ఈవీఎంల లెక్కింపును నిలిపివేసి ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపును పూర్తి చేయాలని, ఆ తరువాతే చివరి రౌండ్‌ ఈవీఎంల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసారి 119 నియోజకవర్గాలకుగాను దాదాపు రెండున్నర లక్షల పోస్టల్‌ బ్యాలెట్లను జారీ చేశారు.