
- కొత్తగూడెం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చేదెవరు?
- జలగమా.. వనమానా? అనే దానిపై చర్చ
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీలో మొదటి రోజు కంటోన్మెంట్ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. దీనిపై చర్చ అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించి, సభ ఎన్ని రోజులు నడిపించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. అలాగే మండలి మొదటి రోజు వాయిదా పడిన తర్వాత చైర్మన్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి, సభలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. కాగా, అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల నిర్వహణ, భద్రత తదితర అంశాలపై చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం సమీక్షించారు.
ఆ ఇద్దరిలో సభకు వచ్చేదెవరు?
ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ హై కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సమావేశాలకు కొత్తగూడెం ఎమ్మెల్యేగా వచ్చేదెవరనే దానిపై చర్చ మొదలైంది. 2018లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వనమా వెంకటేశ్వర్ రావు.. బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావుపై 4వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత వనమా బీఆర్ఎస్లో చేరారు. వనమా ఎన్నికల అఫిడవిట్లో అబద్ధాలు చెప్పారని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని జలగం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. వనమా ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. వనమాకు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. 2018 డిసెంబర్12 నుంచి జలగం వెంకట్రావునే కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతారని వెల్లడించింది. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ వనమా హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. హైకోర్టు తీర్పు వచ్చిన మరుసటి రోజే జలగం వెంకట్రావు.. స్పీకర్‌ను కలిసి హైకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సెక్రటరీతో పాటు సీఈవోను కలిసి హైకోర్టు తీర్పు కాపీలను అందజేశారు. హైకోర్టు ఆదేశాలపై స్పీకర్మంగళవారం రాత్రి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్టే కోరినా వనమాకు హైకోర్టులో ఎలాంటి ఊరట దక్కలేదు. దీంతో ఆయన శాసనసభ్యత్వం కోల్పోయినట్టుగానే అసెంబ్లీ అధికారులు చెప్తున్నారు. అదే సమయంలో హైకోర్టు తీర్పు, వనమా కోరినా స్టే నిరాకరిస్తూ ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన కాపీలు అసెంబ్లీ సెక్రటరీకి అధికారికంగా చేరాల్సి ఉంది. ఇవి అందిన తర్వాత నిబంధనలను అనుసరించి స్పీకర్నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అప్పటి వరకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు అనేది అధికారికంగా తేలదు. దీంతో ఈ సెషన్‌కు వనమా వచ్చే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. అదే సమయంలో స్పీకర్ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా జలగం వెంకట్రావు కూడా వచ్చే ఆస్కారం లేదని అంటున్నారు.