తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మారింది.. డీఎస్హెచ్గా టీవీవీపీ

తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మారింది.. డీఎస్హెచ్గా టీవీవీపీ
  • టీవీవీపీ రద్దు.. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే సంస్కరణ: దామోదర రాజనర్సింహ
  • ప్రజలకు మెరుగైన సేవలు.. ఉద్యోగులకు మేలు
  • అదనపు ఖర్చు లేకుండా అధిక ప్రయోజనం
  • ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లోని 8 విభాగాలను బలోపేతం చేస్తమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ).. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్​కేర్ (డీఎస్​హెచ్)గా మారింది. బుధవారం అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ టీవీవీపీ రిపీల్​బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అధికార, ప్రతిపక్షాలు స్వాగతించడంతో బిల్లు పాసైంది. బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి దామోదర సభలో మాట్లాడారు. టీవీవీపీని డీఎస్​హెచ్​గా మార్చడంతో ఉద్యోగులకు మేలు జరుగుతుందని, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ఆయన చెప్పారు. అదనపు ఖర్చు లేకుండా అధిక ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులోనే మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతోనే టీవీవీపీని రద్దు చేసి డీఎస్​హెచ్​గా మార్చేందుకు సర్కారు నిర్ణయించిందన్నారు. 

ఇది కేవలం పాలనా పరమైన మార్పు కాదని, ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే సంస్కరణ అని మంత్రి దామోదర పేర్కొన్నారు. టీవీవీపీ గ్రాంట్​ ఇన్​ ఎయిడ్​ సంస్థగా పనిచేయడం వల్ల పాలనా పరిమితులు, ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, రోగులకు సేవలందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకే ఉద్యోగుల డిమాండ్​ మేరకు డీఎస్​హెచ్​గా మారుస్తున్నామన్నారు. దీని వల్ల నిపుణులైన వైద్యుల నియామకం, రోగ నిర్ధారణ సేవల విస్తరణ, బలమైన రిఫరల్​ వ్యవస్థ ద్వారా జిల్లా స్థాయిలోనే 80 శాతం వైద్య సేవలు అందించే విధంగా సెకండరీ స్థాయి హాస్పిటళ్లు బలోపేతం అవుతాయన్నారు. దీంతో హైదరాబాద్‌‌‌‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గి.. ప్రజల ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. ఇటు ఉద్యోగులకూ మేలు జరుగుతుందన్నారు. ట్రెజరీ ద్వారా సమయానికి జీతాల చెల్లింపు, ఈహెచ్​ఎస్​ కింద క్యాష్‌‌‌‌లెస్ వైద్యం, రూ.1.2 కోట్ల ప్రమాద బీమా, పూర్తి ప్రభుత్వ ఉద్యోగ హోదా లభిస్తుందని మంత్రి వివరించారు‌‌‌‌.  

ఏరియా, జిల్లా హాస్పిటళ్లను బలోపేతం చేస్తం..

టీవీవీపీ పరిధిలో ఉన్న ఏరియా, జిల్లా హాస్పిటళ్లలోని 16 స్పెషాలిటీ విభాగాల్లోని 8 కీలక విభాగాలను బలోపేతం చేస్తామని మంత్రి దామోదర తెలిపారు. గైనకాలజీ, జనరల్​ మెడిసిన్, జనరల్​ సర్జరీ, పిల్లల వైద్యం, ఆర్థోపెడిక్స్, పాలీట్రామా, కంటి వైద్యం, ఊపిరితిత్తుల విభాగాల్లో సేవలను విస్తరిస్తామని తెలిపారు. జిల్లాల్లో ఆధునిక వైద్య సదుపాయాలను తీసుకురావడంలో భాగంగా ప్రస్తుతం 6 ఆస్పత్రుల్లో ఉన్న సీటీ స్కాన్​ సేవలను విస్తరిస్తామని పేర్కొన్నారు. అదనంగా 200 పడకలకుపైగా ఉన్న 11 ఆస్పత్రుల్లో కొత్తగా సీటీ స్కాన్ యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సమీపంలోనే ఆధునిక నిర్ధారణ సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.  

డయాలసిస్​ సెంటర్లను పెంచుతున్నం

ఐదు జిల్లా ఆస్పత్రుల్లో పీజీ మెడికల్ ​కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దామోదర తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్​ సెంటర్లను పెంచుతామన్నారు. కిడ్నీ రోగులకు 20 నుంచి 25 నిమిషాల్లో సేవలందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర, జాతీయ రహదారుల వెంట ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మొత్తం 109 ట్రామా కేంద్రాల్లో 74 కేంద్రాలు డీఎస్​హెచ్​ పరిధిలో ఏర్పాటు కాబోతున్నాయన్నారు.