ఈసారీ గవర్నర్‌‌ ప్రసంగం లేకుండానే..

ఈసారీ గవర్నర్‌‌ ప్రసంగం లేకుండానే..
  • కీలక బిల్లుల ఆమోదం! 
  • గణేశ్ నిమజ్జనానికి 3 రోజుల సెలవు
  • సభ ఎన్ని రోజులనేది బీఏసీ మీటింగ్‌‌లో నిర్ణయం
  • సెప్టెంబర్‌‌ 17 నుంచి ఏడాదంతా తెలంగాణ వజ్రోత్సవాలు!
  • గత సెషన్‌‌కు కొనసాగింపుగానే ప్రస్తుత సమావేశాలు
  • ఈసారీ గవర్నర్‌‌ ప్రసంగం లేకుండానే..

హైదరాబాద్‌‌, వెలుగు: అసెంబ్లీ, కౌన్సిల్‌‌ సమావేశాలను ఈ నెల ఆరో తేదీ నుంచి నిర్వహించాలని సీఎం కేసీఆర్‌‌ నిర్ణయం తీసుకున్నారు. గత సెషన్‌‌కు కొనసాగింపుగానే ఈ సమావేశాలు జరగనున్నాయి. దీంతో ఈ క్యాలెండర్‌‌ ఇయర్‌‌లో గవర్నర్‌‌ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. 2021 మార్చిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్‌‌ (ఏడో సెషన్‌‌) సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అదే ఏడాది అక్టోబర్‌‌ 8న తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్‌‌ను నిరవధికంగా వాయిదా వేశారు. హుజూరాబాద్‌‌ ఉప ఎన్నికకు ముందు గవర్నర్‌‌ కోటాలో ఎమ్మెల్సీని నామినేట్‌‌ చేయడం, దాన్ని గవర్నర్‌‌ పెండింగ్‌‌లో పెట్టడంతో ప్రగతి భవన్‌‌, రాజ్‌‌భవన్‌‌ మధ్య గ్యాప్‌‌ పెరిగింది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో బడ్జెట్‌‌‌‌ సెషన్‌‌‌‌ను.. అసెంబ్లీ ఎనిమిదో సెషన్‌‌‌‌ రెండో సమావేశంగా, మండలి 18వ సెషన్‌‌‌‌కు రెండో సమావేశంగా నిర్వహించారు. ఆ తర్వాత కూడా అసెంబ్లీని ప్రోరోగ్‌‌‌‌ చేయకపోవడంతో ఆరో తేదీ నుంచి జరిగే సమావేశాలను అసెంబ్లీ 8వ సెషన్‌‌‌‌ మూడో మీటింగ్‌‌‌‌గా, కౌన్సిల్‌‌‌‌ 18వ సెషన్‌‌‌‌ 3వ మీటింగ్‌‌‌‌గా 
నిర్వహించనున్నారు.

సభ్యులకు సెక్రటరీ లేఖ
అసెంబ్లీ, కౌన్సిల్‌‌‌‌ సమావేశాలను ఈ నెల 6న ఉదయం 11.30 గంటలకు నిర్వహించాలని స్పీకర్‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి, మండలి చైర్మన్‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌ రెడ్డి నిర్ణయించారని, ఈ సమావేశాలకు అసెంబ్లీ, కౌన్సిల్‌‌‌‌ సభ్యులు హాజరుకావాలని కోరుతూ అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు శుక్రవారం లేఖ రాశారు. మృతిచెందిన మాజీ సభ్యులకు అసెంబ్లీ, కౌన్సిల్‌‌‌‌ సమావేశాల్లో మొదటి రోజు సంతాపం తెలుపుతారని, తర్వాత రెండు సభలు వాయిదా పడుతాయని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్‌‌‌‌ బీఏసీలు సమావేశమై ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ నెల 9న హైదరాబాద్‌‌‌‌లో గణేశ్‌‌‌‌ నిమజ్జనం ఉండటంతో పెద్ద ఎత్తున భద్రత కల్పించాల్సి ఉంటుంది. దీంతో ఆరు, ఏడు, ఎనిమిది తేదీల్లో సమావేశాలు కొనసాగుతాయని, గణేశ్‌‌‌‌ నిమజ్జనం నేపథ్యంలో మూడు రోజుల సెలవుల తర్వాత 12వ తేదీ నుంచి సమావేశాలు కొనసాగే అవకాశముందని తెలుస్తున్నది.

ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌బీఎంపై చట్ట సవరణ
అసెంబ్లీ, కౌన్సిల్‌‌‌‌ ముందుకు పలు కీలక బిల్లులు రానున్నాయని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో సీబీఐ విచారణ చేపట్టేందుకు ఇక్కడి సర్కారు అనుమతి తప్పనిసరి చేస్తూ తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్లు తీసుకున్న అప్పులను ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌బీఎం పరిధిలోకి తెస్తూ చట్టాన్ని సవరించనున్నట్టు సమాచారం. మహిళా, ఫారెస్ట్‌‌‌‌ యూనివర్సిటీలతో పాటు ఐదు ప్రైవేట్‌‌‌‌ యూనివర్సిటీలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. 

ఇయ్యాల కేబినెట్‌‌, టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీ భేటీ
రాష్ట్ర కేబినెట్‌‌, టీఆర్‌‌ఎస్‌‌ లెజిస్లేటివ్‌‌ పార్టీ సమావేశాలు శనివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌‌లో సీఎం కేసీఆర్‌‌ అధ్యక్షతన మంత్రివర్గం సమావే శమై పలు నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కు రెండు డీఏలు పెండింగ్‌‌లో ఉండగా, ఒక డీఏ అనౌన్స్‌‌ చేయనున్నట్టు తెలుస్తోంది. ఎఫ్ఆర్‌‌బీఎం చట్ట సవరణ, రాష్ట్రంలో సీబీఐ విచారణ చేపట్టేందుకు ఇక్కడి సర్కారు అనుమతి తప్పనిసరి అని పేర్కొంటూ చేసే తీర్మానానికి ఆమోదముద్ర వేయనున్నట్టు సమాచారం. హైదరాబాద్‌‌ సంస్థానం ఇండియన్‌‌ యూనియన్‌‌లో విలీనమై 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌‌ 17 నుంచి ఏడాది పొడవునా తెలంగాణ వజ్రోత్సవాలు నిర్వహించాలని కేబినెట్‌‌ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. తర్వాత సాయంత్రం తెలంగాణ భవన్‌‌లో టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీ మీటింగ్‌‌ నిర్వహించనున్నారు.