సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్, వెలుగు:  వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. ప్రతి సభ్యుడు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. సోమవారం  ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో సీఎం రేవంత్‌‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సభలో ప్రతిపక్షాల ప్రశ్నలకు దీటుగా జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇక నుంచి ఎమ్మెల్యేలంతా నియోజకవర్గ అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టాలని, పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ వెంటనే పరిష్కరించుకోవడంపై దృష్టిపెట్టాలని సూచించారు. 

అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల  ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. భూసేకరణపై ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తే ఇక ఎన్నటికీ పూర్తికావని చెప్పారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, ఫారెస్టు క్లియరెన్స్‌‌లకు సంబంధించిన నిధులను మంజూరు చేసేందుకు  ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.