
విద్యుత్ పై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. విద్యుత్ రంగాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. రైతుల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంట్ తెచ్చారని చెప్పారు. యూపీఏ సర్కార్ ముందు చూపుతో కరెంట్ కష్టాలు తీర్చిందన్నారు. ముఖ్యమైన చర్చ జరిగేటప్పుడు ప్రతిపక్ష నేత ఎందుకు రాలేదని విమర్శించారు.
విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ విచారణ జరుపుతుందని వెల్లడించారు రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో ఆలోచించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు. రూ. 7090 కోట్లతో స్టార్ట్ చేసి రూ. 10 వేల కోట్లకు పెంచారని తెలిపారు. ఫ్రీగా వస్తున్నది తీసుకోక వేల కోట్లు అప్పు చేసి కొత్తది కడుట్టడానికి అప్రూవల్ ఇచ్చారని ఆరోపించారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.. విద్యుత్ శాఖపై సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. సమాచారం ఇవ్వకుండే మాట్లాడమంటే ఎలా అని ప్రశ్నించారు. సరైన సమయానికే సమాచారం ఇచ్చామని శ్రీధర్ బాబు అన్నారు. సభను బుల్డోజ్ చేసేందుకు హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
గత ప్రభుత్వంపై కాంగ్రెస్ సభ్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సభ్యులు సభను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. మోటార్లకు మీటర్లపై కేంద్రంతో కేసీఆర్ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని చెప్పారు. సీఎం రేవంత్ చెప్పే వన్నీ అబద్ధమేనన్నారు. మీటర్ల విషయంలో సీఎం సభను పక్కదారి పట్టించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉదయ్ స్కీంలో చేరామని చెప్పారు. ఉదయ్ స్కీంలో 27 రాష్ట్రాలు చేరాయన్నారు. కేంద్రం ఇచ్చే 30 వేల కోట్లు కూడా వదులుకున్నామని చెప్పారు.
ALSO READ : 100 మంది కౌరవుల్లాగ.. అసెంబ్లీలో మమల్ని కొడతానికి వచ్చిన్రు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కేంద్రం ఒప్పందంతో వాళ్లకు అనుకూలమైన అంశాలను మాత్రమే చెప్పారు. పదేళ్లలో 11 వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం పెంచారని తెలిపారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్ల సంఖ్యను పెంచామని చెప్పారు. కేసీఆర్ హయాంలో అప్పులు చేసి ఆస్తులు పెంచామన్నారు జగదీష్ రెడ్డి.