తెలంగాణలో మరో రెండు దగ్గు మందు అమ్మకాలపై నిషేధం

తెలంగాణలో మరో రెండు దగ్గు మందు అమ్మకాలపై నిషేధం

హైదరాబాద్: తెలంగాణలో రెండు దగ్గు మందుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రీలైఫ్‌, రెస్పీఫ్రెష్‌-టీఆర్‌ దగ్గు మందులను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు దగ్గు మందులను విక్రయించొద్దని మెడికల్ షాపులకు, ఆసుపత్రులకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కోల్డ్రిఫ్ దగ్గ మందుపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ప్రజలకు ఇప్పటికే కీలక హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. అనుమానిత కోల్డ్రిఫ్ సిరప్ బ్యాచ్ నెంబర్ ఎస్ఆర్ 13 వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో దగ్గు మందు తాగిన చిన్నారులు మరణించారని వార్తలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని కంచిపురం జిల్లా సుంగువార్చతిరానికి చెందిన శ్రీసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్రిఫ్ సిరప్ (పారాసెటమాల్, ఫెనిలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్‌‌‌‌ఫెనిరమైన్ మలేట్ కాంబినేషన్) బ్యాచ్ నెంబర్ ఎస్ఆర్13, మాన్యుఫ్యాక్చరింగ్ తేదీ మే 2025, ఎక్స్పైరీ తేదీ ఏప్రిల్ 2027 విషపూరితమైన డైఇథిలీన్ గ్లైకాల్ (డీఈజీ)తో కలుషితమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ సిరఫ్‌ను వాడొద్దని డీసీఏ స్పష్టం చేసింది. ఈ బ్యాచ్ నెంబర్ గల సిరప్ ప్రజలు, డీలర్లు, మెడికల్ షాపుల్లో ఉన్నా వెంటనే డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని డీసీఏ కోరింది.