ఒకే దేశం..ఒకే రేషన్​

ఒకే దేశం..ఒకే రేషన్​
  • ఒకే దేశం–ఒకే కార్డు’ లక్ష్యంతో 2020 జూన్‌ నుంచి అమలు
  • తొలుత నాలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 1 నుంచి పైలెట్ ప్రాజెక్టు
  • తెలంగాణ, ఏపీ ఒక క్లస్టర్.. గుజరాత్, మహారాష్ట్ర మరో క్లస్టర్
  • హైదరాబాద్ లో ట్రయల్‌ రన్‌ సక్సెస్.. రేషన్‌ తీసుకున్న ఏపీ వాసులు

హైదరాబాద్‌, వెలుగుదేశంలో ఎక్కడి నుంచైనా రేషన్‌ సరుకులు తీసుకునేలా నేషనల్‌ పోర్టబులిటీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ‘ఒకే దేశం-–ఒకే కార్డు’ పేరుతో వచ్చే ఏడాది జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముందుగా ఆగస్టు 1 నుంచి తెలంగాణ, ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది.

రాష్ట్ర విధానాన్ని చూసే..

బతుకుదెరువు కోసం వలస వెళ్లే నిరుపేదలు బియ్యం, ఇతర రేషన్‌ సరుకుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఏ ఊరివారు మరే ఊరిలోని రేషన్​ షాపులోనైనా సరుకులు తీసుకునే విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైనా రేషన్​ సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఒక క్లస్టర్‌గా, గుజరాత్‌, మహారాష్ట్ర మరో క్లస్టర్‌గా ఏర్పాటు చేసి.. పైలట్​ ప్రాజెక్టుగా ఆగస్టు 1 నుంచి నేషనల్‌ పోర్టబులిటీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌ లోని పంజాగుట్టలో ఉన్న ఒక రేషన్‌ షాపులో ట్రయల్‌ విజయవంతంగా నిర్వహించారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈశ్వర్‌ రావు, విశాఖపట్నం జిల్లా యలమంచిలికి చెందిన అప్పారావు అనే ఇద్దరు లబ్ధిదారులు పంజాగుట్ట రేషన్​షాపులో సరుకులు తీసుకున్నారు. పోర్టబులిటీ ట్రయల్‌ విజయవంతం కావడంపై పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్ సబర్వాల్ హర్షం వెలిబుచ్చారు.

రాష్ట్రంలో సూపర్​హిట్!

రేషన్​ పోర్టబులిటీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఏప్రిల్​ నుంచే విజయవంతంగా అమలు చేస్తోంది. ఇప్పటివరకు 2.07 కోట్ల మంది రేషన్‌ పోర్టబులిటీని వినియోగించుకున్నారు. అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 42 లక్షల మంది, మేడ్చల్‌ 29 లక్షలు, రంగారెడ్డి 18 లక్షలు, నిజామాబాద్‌ 10 లక్షలు, వరంగల్‌ లో 9 లక్షల మంది ఇతర ప్రాంతాల వారు రేషన్‌ సరుకులను తీసుకున్నారు. ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వచ్చిన వారికి పోర్టబులిటీతో ఎంతో ప్రయోజనం కలుగుతోందని.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఎక్కువగా పోర్టబులిటీ రేషన్​ తీసుకోవడమే దీనికి నిదర్శనమని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

రేషన్‌ పోర్టబులిటీ మార్గదర్శకాలివే..

  • రెండో క్లస్టర్‌లోని గుజరాత్‌, మహారాష్ట్రాల లబ్ధిదారులు ఆ రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకోవచ్చు.
  • బియ్యం, గోధుమలు, చిరు ధాన్యాలు కేంద్ర ప్రభుత్వం నిర్దేశిం చిన మొత్తంలో, నిర్ణయించిన ధరల ప్రకారం ఇస్తారు.