
దసరా పండుగను తెలంగాణలో పెద్ద పండుగ అంటారు. అసలు పెద్ద పండుగ అంటే ఏమిటి..పెద్ద పండుగ ప్రత్యేకత ఏమిటి.. పిల్లలు.. పెద్దలు ఎలా సంబరాలు చేసుకుంటారు.. తెలంగాణల దసరా ఎందుకు ఇంత స్పెషల్? ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
ఏ పండుగకైతే వాళ్లు, వీళ్లు అని లేకుంట అందరూ కొత్త బట్టలు వేసుకుంటారో...అది పెద్ద పండుగ.ఏ పండుగకైతే ఎక్కడెక్కడో పనిచేసుకుంటున్న వాళ్లంతా ఊరి బాట పడుతారో అది పెద్ద పండుగ. ఏ పండుగకైతే ఎప్పుడో కనిపించిన దోస్తులు కూడా కనిపిస్తారో అది పెద్ద పండుగ.పెద్ద పండుగొస్తే ఊరు ఊరంతా జోష్ ఉంటుంది. మనుషులు ఆ పండుగవరకు అన్ని కష్టాలను మరచిపోయి సంతోషంగాఉంటారు.
మన తెలంగాణల అట్లాంటి పెద్ద పండుగంటే దసరా. పిల్లల దగ్గర్నించి పెద్దల వరకు అందరూ కొత్త బట్టలేసుకొని, గుడికి పోయి,అంతా బాగుండాలని దేవునికి మొక్కుకొని, జమ్మి చెట్టు దగ్గరికి పోయి జమ్మి ఆకులు తెంపుకొచ్చి, అందరికీ పంచి ఆలయ్ బలయ్' ఇచ్చి, ఇష్టమైన వంటలు చేసుకొని తిని, ఇల్లంతా ఒక కళను తెచ్చిపెట్టుకుంటరు కదా! అది.దసరా పండుగ. అది పెద్ద పండుగ.
దసరా. .. విజయదశమి. పేరు ఏదైనా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే చెడు మీద మంచి సాధించే విజయమే విజయ దశమి. ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల దేవీ నవరాత్రుల ఉత్సవం తర్వాత పదో రోజు దశమి నాడు వచ్చే పండుగే దసరా. విజయానికి మారు పేరు కాబట్టి విజయదశమి దసరా పెద్ద పండుగ.
ఏ మతానికి సంబంధించిన పండుగైనా ఆ పండుగలో దైవం, మతంతో సంబంధం ఉన్న ఒక కథ ఉంటుంది. అలాగే మనుషులు, ప్రాంతాలకు సంబంధించిన ఒక కల్చర్ లైఫ్ ఉంటుంది. అలాంటి కనెక్షన్ ఒక్కొక్కరికి ఒక్కో పండుగలో దొరుకుతుంది. ఆంధ్రాకి వెళ్తే సంక్రాంతి పెద్ద పండుగ. తెలంగాణలో తొమ్మిదిరోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలు.ఆ ఉత్సవాల సమయంలోనే వచ్చే బతుకమ్మ, ఆ తర్వాత దశమి రోజున వచ్చే దసరా... ఈ పది రోజులూ పండుగ వాతావరణమే ఉంటుంది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ వరకు ఆడవాళ్ల వెనక ఉండి వాళ్ల సంబరానికి అందాన్నిచ్చే మగవాళ్లు...దసరా రోజుకి వచ్చేసరికి తమ సంబరంలో పడిపోతారు. జెండర్ హార్మొన్ అన్నది సరిగ్గా ఈ పండుగలప్పుడు చూడొచ్చు.
మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో దేశంలో ఎక్కడైనా పండుగలు, పుట్టినరోజులకే కొత్త బట్టలు కొంటారు. అలాంటి ఒక పెద్ద పండుగ తెలంగాణలో ఎక్కువమందికి దసరానే. ప్రతి ఏడాది ఆశ్వయుజమాసంలో వచ్చే ఈ పండుగ సమయంలో తెలంగాణలో అన్నీ ఊళ్లల్లో సంబరాలే కనిపిస్తాయి.
విజయ దశమికి తెలంగాణలో అమ్మవారికి నవరాత్రి పూజలు ఉంటాయి. శ్రీరాముడికి పండుగ రోజు ప్రత్యేక పూజలూ ఉంటాయి. పేదరికం. కష్టాలు, కన్నీళు అన్నీ మరచిపోయి అందరూ ఒక సెలబ్రేషన్లు చేసుకుంటారు కాబట్టే.. దనరా అంత స్పెషల్. తెలంగాణలో దసరా అనే మాటను సెలబ్రేషన్ అనే పదానికి అర్థంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో దసరానే పెద్ద పండుగ . నార్త్ ఇండియాలో దీపావళిని బాగా సెలబ్రేట్ చేస్తుంటారు. కేరళలో ఓనమ్.... తమిళనాడులో పొంగల్.... పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ. ఇలా మన దేశంలోనే ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో పండుగతో గుర్తించొచ్చు.
పిల్లలకు సెలవులతో మొదలు
దసరా పండుగతో తెలంగాణ ప్రజల జీవితానికి, కల్చర్ కి ఉన్న కనెక్షన్ చూస్తే.. దశమి రోజుకి పది రోజుల ముందు నుంచే పండుగ హడావిడి కనిపిస్తుంది. స్కూల్ పిల్లలకు క్వార్టర్లీ పరీక్షలు అయిపోగానే దసరా సెలవులు వచ్చేస్తాయి. అప్పటివరకు చదువుల మీద పడ్డ వాళ్లంతా హాలిడేస్ మూడ్లోకి వెళ్లిపోతారు. ఊర్లని, ఆటలని ఆ గోలలో పడిపోతారు. ఈ సెలవుల టైమ్ లోనే నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దాంతో పాటే ఒక్కోరోజు ఒక్కో పేరుతో బతుకమ్మ. అదే ఊళ్లో ఉన్నా లేక సెలవులకు అని చుట్టాల ఇంటికే వెళ్లినా పిల్లలకు దసరా పండుగంటే సెలవులతోనే. వాళ్ల గోలతో పెద్దవాళ్లకు ఉండే పనుల గురించి చెప్పక్కర్లేదు.
షాపింగ్ టైమ్ ఇదే!
దసరా ఏ బిజినెస్ కైనా పెద్ద సీజన్. ఈ సీజన్లోనే ఎవరైనా కొత్త బట్టలు, చెప్పులు, ఇంట్లో ఏదో ఒక కొత్త వస్తువు లాంటివి కొంటుంటారు. దాదాపు అందరికీ ఈ సీజన్లో షాపింగ్ అన్నది తప్పనిసరి కాబట్టి రోడ్లు, మార్కెట్లన్నీ కళకళలాడిపోతుంటాయి. చిన్న చిన్న ఊళ్లలో ఉండేవాళ్లు దగ్గర్లోని టౌన్లకి వెళ్లి మరీ షాపింగ్ చెయ్యాలి. ఇంటిల్లిపాదికి బట్టలు కొనాలంటే దానికి డబ్బులు కావాలి. చిన్న ఉద్యోగులకు దసరా పండుగ టైమ్ కే బోనస్లు ఇస్తుంటాయి కంపెనీలు.. ఆ బోనస్ వస్తే వాళ్లకు దసరా షాపింగ్ కి డబ్బులు అందినట్లే. 'దసరా బోనస్' అన్న మాటకోసం ఆ చిన్న ఉద్యోగులు ఎదురుచూసేది కూడా ఈ షాపింగ్ కోసమే.
పండుగంటే పండుగే..
నవరాత్రి ఉత్సవాలు, సద్దుల బతుకమ్మ పండుగ కూడా ముగిశాక దశమి రోజు వచ్చే దసరా పండుగంటే తెలంగాణాలో ఎవ్వరికైనా ప్రతి ఏడాదీ ఒక మరచిపోలేని అనుభూతి. వర్షాకాలం మెల్లగా శీతాకాలానికి వెళ్లే కాలం ఇది. చిన్న చిన్న వానలు పడుతుంటే, పల్లెలకు వెళ్తే ఎక్కడచూసినా పచ్చని చెట్లే కనిపిస్తాయి. అడవి పూల అందాలు ఎక్కడైనా పలకరిస్తుంటాయి. ఎక్కువమంది సొంత ఊళ్లకే వెళ్లిపోతారు కాబట్టి నగరాలు ఖాళీ అవుతుంటాయి