బండి సంజయ్​ అరెస్ట్​

బండి సంజయ్​ అరెస్ట్​
  • నిర్మల్ జిల్లా భైంసాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
  • కాన్వాయ్‌‌ని చేజ్ చేసి అదుపులోకి.. కరీంనగర్‌‌‌‌కు తరలింపు
  • రోడ్డెక్కిన బీజేపీ కార్యకర్తలు.. జగిత్యాలలో టెన్షన్​ టెన్షన్
  • భైంసా నిషేధిత ప్రాంతమా? ఎందుకు వెళ్లకూడదు: బండి సంజయ్​
  • భైంసాను కాపాడలేని సీఎం.. రాష్ట్రాన్ని ఎట్ల కాపాడుతడని ప్రశ్న
  • షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర చేసి తీరుతానని వెల్లడి

జగిత్యాల/మెట్​పల్లి/నిర్మల్/భైంసా/కరీంనగర్, వెలుగు: ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర కోసం నిర్మల్ జిల్లా భైంసాకు బయల్దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌‌ని పోలీసులు అరెస్టు చేశారు. కాపుకాసి.. వెంటాడి.. నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుని కరీంనగర్‌‌‌‌కు తరలించారు. పాదయాత్రకు ముందు అనుమతి ఇచ్చి, తర్వాత పోలీసులు తనను అడ్డుకోవడంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. షెడ్యూల్ ప్రకారమే ప్రజా సంగ్రామ యాత్ర చేసి తీరుతానని స్పష్టం చేశారు. మరోవైపు సంజయ్ అరెస్టుతో జగిత్యాల, కోరుట్ల, మెట్​పల్లి పట్టణాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. దీంతో కరీంనగర్ నుంచి కోరుట్ల వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

వెంకటాపూర్ వద్ద చుట్టుముట్టి..

కరీంనగర్ నుంచి జగిత్యాల మీదుగా నిర్మల్‌‌కు సంజయ్ వెళ్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు జగిత్యాల టౌన్ పరిధిలోని తాటిపల్లిలో కాపుకాశారు. ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్​ఐలు, 15 మంది పోలీసులు.. సంజయ్ కాన్వాయ్‌‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

కానీ సంజయ్ వారిని తప్పించుకొని ముందుకెళ్లారు. పోలీసులు కాన్వాయ్‌‌ని చేజ్ ​చేస్తూ ముందుకెళ్లగా.. మేడిపల్లిలోని మాజీ సర్పంచ్, బీజేపీ లీడర్ బొంగోని రాజాగౌడ్ ఇంటి వద్ద సంజయ్ కారు నిలిపి లోనికి వెళ్లారు. బయటకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు రాజాగౌడ్ ఇంటి ముందు ఆగారు. అక్కడికి పెద్దసంఖ్యలో బీజేపీ కార్యకర్తలు.. మరింత మంది పోలీసులు చేరుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో సంజయ్ కార్యకర్తల సాయంతో​ పోలీసుల కండ్లుగప్పి వేరే వెహికల్‌‌లో కోరుట్ల మార్గంలో వెళ్లారు. గమనించిన పోలీసులు 4వాహనాల్లో వెంబడించి కోరుట్ల సమీపంలోని వెంకటాపూర్ వద్ద చుట్టుముట్టారు. బలవంతంగా సంజయ్‌‌ని అదుపులోకి తీసుకొని కరీంనగర్ వైపు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో రోడ్లపైకి చేరారు. జగిత్యాల టీఆర్ నగర్ వద్ద టైర్లు తగులబెట్టి రాస్తారోకో చేశారు. దీంతో సంజయ్‌‌తో వస్తున్న పోలీసుల వెహికల్స్ కొద్దిసేపు ఆగిపోయాయి. తర్వాత సంజయ్‌‌ని కరీంనగర్ తరలించారు.

అనుమతి ఇచ్చి అడ్డుకుంటరా?: సంజయ్

పోలీసుల తీరుపై బండి సంజయ్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా పరిధిలో తాను ఎలాంటి సమావేశాలు పెట్టడం లేదని, అలాంటప్పుడు తనని ఇక్కడ ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. పాదయాత్రకు ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు, తీరా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక క్యాన్సల్ చేయడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఓ వైపు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వస్తున్నారని, ఇలాంటి టైంలో భైంసా సున్నితమైన ప్రాంతం అని పోలీసులకు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ‘‘భైంసా ఏమన్నా నిషేధిత ప్రాంతామా? అక్కడికి ఎందుకు వెళ్లకూడదు? భైంసాను కాపాడలేని  ముఖ్యమంత్రి.. రాష్ట్రాన్ని ఎలా కాపాడతాడు?” అని ఫైర్ అయ్యారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రజా సంగ్రామ యాత్ర  నిర్వహించి తీరుతామని సంజయ్ స్పష్టం చేశారు.

భగ్గుమన్న బీజేపీ శ్రేణులు

బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు కోరుట్ల, మెట్​పల్లి పట్టణాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెట్‌‌పల్లి పట్టణంలో గంటన్నరకు పైగా రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రం మెట్ పల్లిలోని బస్ డిపో వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి వాహన తనిఖీలు చేపట్టారు. దీంతో సంజయ్​ను అరెస్టు చేస్తారనే అనుమానంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సంజయ్ ని వెంకటాపూర్ వద్ద పోలీసులు అరెస్టు చేసినట్లు తెలియడంతో ఎన్ హెచ్ 63పై బైఠాయించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీ సులు వారిని చెదరగొట్టారు.

బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్

బండి సంజయ్ అరెస్ట్‌‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలపై మాల్యాల చౌరస్తా వద్ద పోలీసులు దాడికి దిగారు. దొరికిన వాళ్లను దొరికినట్లు విచక్షణారహితంగా లాఠీలతో చితకబాదారు. సీఐ కిషోర్.. నూకపల్లి ఉప సర్పంచ్ డొక్కలో తన్నారు. కార్యకర్తల కాలర్ పట్టుకుని కొట్టారు. ఈ దాడిలో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో టీఆర్ఎస్ సర్కార్ తీరుకు నిరసనగా రోడ్డుపై కార్యకర్తలు బైఠాయించి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

నిర్మల్ ఎస్పీ ఆఫీసు ముట్టడి

నిర్మల్ జిల్లాలోని భైంసాలో ప్రజా సంగ్రామ యాత్ర, బహిరంగ సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆదివారం సాయంత్రం జిల్లా ఎస్పీ ప్రవీణ్​ కుమార్ ప్రకటించారు. భైంసాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన ప్రకటనపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. గేటు ముందు బైఠాయించి సర్కారుకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా అనుమతి ఇచ్చి, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక పర్మిషన్ ఎలా క్యాన్సిల్ చేస్తారని ప్రశ్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని నిర్మల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా మంచిర్యాల చౌరస్తాలో బీజేవైఎం కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. పార్టీ శ్రేణులతో చర్చిస్తున్న లీడర్లు మోహన్​రావు పటేల్, రామారావు పటేల్​లను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనాల్లో స్టేషన్‌‌కు తరలించారు.

సభ నిర్వహించి తీరుతాం: ఎంపీ సోయం

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఎంఐఎం హస్తం ఉందని, ఆ పార్టీకి భయపడే అనుమతులు నిరాకరించారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. సంజయ్‌‌ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమేనన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రాజ్యంగబద్ధంగా పాలన సాగడం లేదన్నారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసే సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నదని ధ్వజమెత్తారు. పాదయాత్ర, సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.