
రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ.. వారిలో ఒకరికి కచ్చితంగా అవకాశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ నాలుగు లోక్‌సభ సీట్లు గెలుచుకోవడంతో కేంద్రంలో మంత్రిపదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ మొదలైంది. కచ్చితంగా ఒకరి చాన్స్ ఉంటుందని, రెండో మంత్రి పదవి కూడా రావొచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నలుగురు ఎంపీల్లో కిషన్‌రెడ్డికే కేబినెట్ బెర్త్అవకాశం ఎక్కువగా ఉందని.. రెండో మంత్రి పదవి వస్తే ధర్మపురి అర్వింద్ కుగానీ, బండి సంజయ్‌కి కానీ చాన్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సామాజిక సమీకరణాలు అనుకూలిస్తే ఎస్టీ వర్గానికి చెందిన సోయం బాపురావుకు కేంద్ర మంత్రి పదవి రావొచ్చని అంటున్నారు.
దత్తాత్రేయ తర్వాత..
గత ఎలక్షన్లలో రాష్ట్రం నుంచి గెలిచిన ఏకైక ఎంపీ దత్తాత్రేయకు కేబినెట్ చాన్స్ వచ్చింది. కానీ మధ్యలోనే ఆయన పదవి పోవడంతో రాష్ట్రానికి కేంద్ర మంత్రవర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈసారి అనూహ్యంగా నలుగురు ఎంపీలు గెలిచారు. దానికితోడు కేంద్రంలోనూ బీజేపీ ఏకంగా 303 సీట్లలో విజయం సాధించింది. ఈసారి ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు కూడా తగ్గాయి. కేంద్రంలో కేబినెట్, స్వతంత్ర హోదా, సహాయ మంత్రులు కలిపి మొత్తంగా 80 మంది వరకు ఉండవచ్చు. ఈ లెక్కన కనీసం ఆరుగురిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. అందులో కీలకమైన రాష్ట్రాలు, భవిష్యత్తులో కీలకం అవుతాయనుకున్న ప్రాంతాలకు చెందినవారికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో తెలంగాణలో పట్టుసాధించాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ.. గెలిచిన నలుగురిలో ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అవకాశం ఎవరిని వరిస్తుందన్న దానిపై చర్చ జరుగుతోంది.
రెడ్డి సామాజికవర్గం లెక్కన
తాజాగా పదవీకాలం ముగిసిన కేంద్ర కేబినెట్లో రెడ్డి సామాజికవర్గానికి చెందినవారెవరూ లేరు. గత 60 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్‌రెడ్డి ఈ ఈక్వేషన్లను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళుతున్నట్టు సమాచారం. నిజానికి కిషన్‌రెడ్డి యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ అగ్రనేతలతో పరిచయాలు ఉన్నాయి. అప్పట్లో బీజేపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శిగా ఉన్న నరేంద్ర మోడీతో కిషన్‌రెడ్డి సన్నిహితంగా ఉండేవారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతోనూ మంచి పరిచయం ఉంది. దీంతో ఆయనకే అవకాశం ఎక్కువంటున్నారు.
లైన్లో జెయింట్ కిల్లర్లు
నిజామాబాద్ నుంచి గెలిచిన ధర్మపురి అర్వింద్ కూడా మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు అమిత్‌షాతో వ్యక్తిగత పరిచయాలున్నాయి. సీఎం కేసీఆర్ కూతురు కవితపై భారీ మెజార్టీతో గెలిచి జెయింట్ కిల్లర్‌గా నిలవడం, బీసీ వర్గం కావడం కూడా కలిసొచ్చే అంశం. కరీంనగర్ నుంచి భారీ మెజార్టీతో గెలిచిన బండి సంజయ్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ అండదండలూ ఉన్నాయి. రాజకీయ గురువులైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, మురళీధర్‌రావుల ద్వారా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి గెలిచిన సోయం బాపురావు ఎలక్షన్ల ముందే బీజేపీలో చేరారు. పార్టీ పెద్దల పరిచయాలేమీ లేవు. ఒకవేళ ఎస్టీ సామాజికవర్గం లెక్కలేవైనా కలిసొస్తే.. కేబినెట్ చాన్స్ ఉండొచ్చని అంటున్నారు. మొత్తంగా నలుగురిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు.
సంజయ్‌కు రాష్ట్ర చీఫ్ చాన్స్!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌కు అవకాశం రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఒక్క విద్యాసాగర్ రావు తప్ప హైదరాబాద్‌కు చెందినవాళ్లకే బీజేపీ చీఫ్లుగా అవకాశం వచ్చింది. మారిన సమీకరణాల్లో ఇతర ప్రాంతాల వారికి రాష్ట్ర చీఫ్‌గా అవకాశమిస్తే, పార్టీ మరింతగా పుంజుకోవచ్చని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీలో కమిటెడ్‌గా పనిచేస్తున్న బండి సంజయ్‌పై దృష్టి పడింది. టీఆర్ఎస్ క్యాండిడేట్పై భారీ మెజార్టీతో గెలవడం, ప్రజల్లో ఆదరణ ఉండటం, బీసీ కావడం ఆయనకు కలిసొస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అర్వింద్‌కు హైకమాండ్ పిలుపు
ధర్మపురి అర్వింద్ శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపుమేరకే ఆయన ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి నలుగురు విజయం సాధించినా అర్వింద్‌కే పిలుపు రావడంతో ఆయనకు కేంద్ర కేబినెట్లో బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. పార్టీ వర్గాలు మాత్రం అర్వింద్ స్వయంగా ఢిల్లీ వెళ్లి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెబుతున్నాయి.