వరి రైతుల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వం

వరి రైతుల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వం
  • స్థానికులకు ఉద్యోగాల్లేవ్​బయటివారికే ప్రాధాన్యత
  • హైదరాబాద్​లో నీళ్లు తాగి సచ్చిపోతే స్పందించరా?
  • బీఎస్పీ స్టేట్​ చీఫ్​ కో ఆర్డినేటర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

గరిడేపల్లి, వెలుగు: వరి రైతుల నోట్లో ప్రభుత్వం మట్టికొట్టిందని, అందుకే ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి మండలంలో ఉన్న పొనుగోడు, గరిడేపల్లి, కీతవారిగూడెం గ్రామాల్లో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్​ఎస్​ప్రవీణ్​కుమార్​ మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎంఎల్ఏలు , మంత్రులు మిల్లర్లతో కుమ్మక్కయ్యి క్వింటాల్ కి రూ.1900 నుంచి రూ.2000 ఇవ్వాల్సిన చోట రూ.1300..రూ.1400 ఇస్తున్నారని ఆరోపించారు. శనివారం సూర్యాపేట మార్కెట్ యార్డ్ లో రైతులే వడ్లను దగ్ధం చేశారంటే అన్నదాతలు ఎంతలా ఆవేదన చెందుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చిన ఎంఎల్ఏ సైదిరెడ్డి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. గరిడేపల్లి లాంటి పెద్ద మండలంలో కనీసం ఇంటర్​, డిగ్రీ కాలేజీలు లేకపోవడం విచారకరమన్నారు. హుజూర్ నగర్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ ల్లో స్థానికులకు లేరని, బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలిస్తున్నారన్నారు. చివరికి కేసీఆర్​కూడా రూ.600 కోట్లు ఇచ్చి బిహార్ నుంచి పీకేను పిలిపించుకున్నారన్నారు. నాలుగు రోజుల కింద హైదరాబాద్ లోని గుట్టల బేగంపేట లో కలుషిత నీరు తాగి ఒకరు చనిపోయారని, 20 మంది హాస్పిటల్ లో చేరారని, దీనిపై కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇదే ఘటన జూబ్లీహిల్ల్స్ లోనో, బంజారాహిల్స్​లోనే జరిగితే ఆగమేఘాల మీద ఆఫీసర్లను సస్పెండ్​ చేసేవారన్నారు. కానీ గుట్టల బేగంపేటలో ఉన్నది వడ్డెర కులస్థులు, బహుజనులు కావడంతో పట్టించుకోలేదన్నారు. బహుజనులకు న్యాయం జరగాలంటే ప్రగతి భవన్ లో దొరలు కాకుండా బహుజనులు కూర్చోవాలని, అందుకే ఏనుగు గుర్తుకే ఓటెయ్యాలన్నారు. బీఎస్పీ జిల్లా ఇన్​చార్జి శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు రవికుమార్, హుజూర్ నగర్ అసెంబ్లి ఇన్​చార్జి డా. సాంబశివగౌడ్, నర్సింహా, వెంకటేశ్వర్లు, పిడమర్తి శ్రీనివాస్, బరిగెల విజయ్ పాల్గొన్నారు.