- ముందస్తు అనుమతి లేకుండా కొత్త స్కీమ్‌లను చేర్చొద్దు
- కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ జీతాలకు ప్రత్యేక ఖాతా
- డిసెంబర్ 31లోగా హెచ్‌వోడీలు, జనవరి 6లోగా సెక్రటేరియెట్ హెడ్స్ వివరాలు పంపాలి
- ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సర(2026–27) బడ్జెట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ అంచనాలను రూపొందించాలని అన్ని శాఖలను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బడ్జెట్ ప్రతిపాదనల తయారీని ‘అత్యంత ప్రాధాన్యత’ అంశంగా పరిగణించాలని అధికారులకు స్పష్టం చేశారు.
వనరుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అంచనాలను అమాంతం పెంచడం కాకుండా, వాస్తవ అవసరాల మేరకే నిధులు కోరాలని అధికారులకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊహాజనిత లెక్కలతో ప్రతిపాదనలు పంపకూడదని తేల్చిచెప్పింది. బడ్జెట్ ప్రతిపాదనల సమర్పణకు ఆర్థిక శాఖ గడువును (డెడ్‌లైన్) నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ అందుబాటులోకి రానుంది.
విభాగాల అధిపతులు(హెచ్ఓడీలు) తమ ప్రతిపాదనలను డిసెంబర్ 31లోగా ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం సచివాలయ శాఖలు వీటిని పరిశీలించి జనవరి 6 కల్లా ఆర్థిక శాఖకు పంపాలి. నిర్ణీత గడువు దాటితే పోర్టల్ మూసివేస్తామని, ఆలస్యానికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు, ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కొత్త పథకాలను బడ్జెట్ అంచనాల్లో చేర్చవద్దని ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
కేంద్ర పథకాలను పూర్తిగా వాడుకోవాలి
ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యతలను పాటించాలని, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను పూర్తిస్థాయిలో వాడుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ పేర్కొంది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపుల విషయంలోనూ ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది.
నిర్ణీత హెడ్స్ ద్వారా కాకుండా ఇతర హెడ్స్ ద్వారా జీతాలు డ్రా చేస్తే, సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్‌బర్సింగ్ ఆఫీసర్లపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జీవోలో హెచ్చరించింది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ బడ్జెట్ క్యాలెండర్ ప్రకారం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, గడువులోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.
