వెలుగు ఓపెన్ పేజీ : ఆర్థిక ఒత్తిడిలో తెలంగాణ బడ్జెట్!

వెలుగు ఓపెన్ పేజీ : ఆర్థిక ఒత్తిడిలో తెలంగాణ బడ్జెట్!

తెలంగాణ  ప్రభుత్వం  ప్రతిపాదించిన  రూ. 3,24,234 కోట్ల  బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని సంక్షేమం వైపు మళ్లిస్తూనే. మౌలిక సవాళ్లను ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తోంది.  గత ఏడాదితో  పోలిస్తే సుమారు 10 శాతం వృద్ధిని నమోదు చేస్తూ సంక్షేమం,  అభివృద్ధి మధ్య  సమతుల్యత  సాధించే  ప్రయత్నం  కనిపిస్తోంది.  ఆకర్షణీయమైన అంకెల వెనుక దాగి ఉన్న ఆర్థిక సవాళ్లు,  పెరుగుతున్న అప్పుల భారం రాష్ట్రాన్ని ఏ తీరాలకు చేరుస్తాయనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం.  బడ్జెట్‌‌లో ఆరు గ్యారంటీల  అమలుకు రూ. 50,713 కోట్లు కేటాయించడం సామాజిక  భద్రతపై  ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. ఈ కేటాయింపులు పలు సవాళ్లను లేవనెత్తుతున్నాయి. ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకం ద్వారా కోటిన్నర కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా కల్పించడం మెరుగైన చర్యే అయినప్పటికీ దీని ఆర్థిక నిర్వహణ సంక్లిష్టంగా కనిపిస్తోంది.  రుణాల ద్వారా సేకరించిన నిధులను బీమా ప్రీమియంల వంటి పునరావృత వ్యయాలకు మళ్లించడం వల్ల డెడ్ వెయిట్ లాస్ ఏర్పడి భవిష్యత్తులో రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. 

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 

రూ. 1,000 కోట్లు  కేటాయించడం  గతానుభవాల  దృష్ట్యా ఒక చారిత్రక నిర్ణయం. విద్యారంగానికి రూ. 26,674 కోట్లు,  వైద్యారోగ్యశాఖకు  రూ. 13,679 కోట్లు కేటాయించడం ద్వారా మానవ వనరుల అభివృద్ధిపై  ప్రభుత్వం దృష్టి సారించింది.  ప్రీ -ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్‌‌ఫాస్ట్ పథకం ప్రారంభించడం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించడం విద్యార్థుల హాజరు పెరిగే అస్కారం ఉన్నది.  ఈ  కేటాయింపులు అధికశాతం జీతభత్యాలకే  సరిపోతున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత,  ఆసుపత్రుల్లో  ఆధునిక పరికరాల లేమిని ఈ నిధులు ఏమేరకు భర్తీ  చేస్తాయనేది సందేహాస్పదమే. 

అప్పుల భారం 

తెలంగాణ  అప్పుల ఊబిలో  కొట్టుమిట్టాడుతోంది.  గత  పదేళ్లలో  రుణభారం  ప్రమాదకర స్థాయికి చేరుకుంది.  ముఖ్యంగా కాళేశ్వరం వంటి భారీ సాగునీటి  ప్రాజెక్టుల కోసం తీసుకున్న కార్పొరేషన్  రుణాలు,  రైతుబంధు వంటి సంక్షేమ పథకాల అమలు ఈ ఆర్థిక భారానికి  ప్రధాన కారణాలుగా నిలిచాయి.  ప్రస్తుతం రాష్ట్ర ఆదాయంలో సుమారు 34 శాతం కేవలం పాత అప్పుల వడ్డీలు, అసలు చెల్లింపులకే సరిపోతుండటం గమనార్హం.  తెలంగాణ బడ్జెట్ 2026-–27ను  నిశితంగా విశ్లేషిస్తే  సంక్షేమ పథకాలకు ఇస్తున్న ప్రాధాన్యతకు, రాష్ట్ర ఆర్థిక సుస్థిరతకు మధ్య సమతుల్యత లోపిస్తున్నట్లు కనిపిస్తోంది.  రాష్ట్ర బహిరంగ అప్పులు సుమారు రూ. 5.62 లక్షల కోట్లకు చేరుకుంటాయనే  అంచనాలు ఆర్థిక క్రమశిక్షణపై  ఆందోళన రేకెత్తిస్తున్నాయి.  ప్రస్తుత ఏడాదే  రూ. 73,383 కోట్ల మేర కొత్త  రుణాలను ప్రతిపాదించడం గమనిస్తే  రాష్ట్ర  ఆర్థికవ్యవస్థ  రుణాధారిత నమూనా వైపు వేగంగా  మళ్లుతోందని  స్పష్టమవుతోంది.  రాష్ట్ర మొత్తం వ్యయంలో  రెవెన్యూ వ్యయానికి రూ. 2,34,406 కోట్లు  కేటాయించగా  మౌలిక  వసతుల కల్పనకు  ఉద్దేశించిన మూలధన వ్యయం కేవలం  రూ. 47,267 కోట్లకే  పరిమితమైంది.  దీనివల్ల  బడ్జెట్‌‌లోని  సింహభాగం వడ్డీలు, జీతాలు,  సంక్షేమ పథకాలు వంటి రోజువారీ నిర్వహణ  ఖర్చులకే  వ్యయమవుతోంది. 

ఆర్థిక సార్వభౌమత్వం 

ప్రస్తుతం తెలంగాణ బడ్జెట్‌‌లో 15-–18 శాతం నిధులు కేవలం వడ్డీలకే  వెచ్చించాల్సి రావడం గమనార్హం.  ఫిస్కల్  రెస్పాన్సిబిలిటీ  అండ్  బడ్జెట్ మేనేజ్మెంట్  పరిమితులను మించి అప్పులు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక స్వయంప్రతిపత్తి  దెబ్బతింటుంది.  కేంద్ర నిధులపై  లేదా  గ్రాంట్లపై  ఆధారపడటం  పెరుగుతుంది.  రాబోయే దశాబ్ద కాలంలో ఈ అప్పులను తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చే రుణ ఉచ్చులోకి రాష్ట్రం వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.  సంక్షేమ పథకాలు  సామాజిక న్యాయానికి  ప్రాతిపదికలు అయినప్పటికీ అవి ఆర్థికవ్యవస్థను నిర్వీర్యం చేయకూడదు.  అప్పు అనేది పెట్టుబడిగా  మారినప్పుడే అది ఆస్తి అవుతుంది. ఖర్చుగా మారితే అది భారమవుతుంది అనే ఆర్థిక సూత్రాన్ని ప్రభుత్వం విస్మరించకూడదు.  పరిశ్రమల స్థాపన,  వ్యవసాయ ఆధునికీకరణ ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమానికి వాడాలి తప్ప అప్పులతో సంక్షేమాన్ని నడపడం శ్రేయస్కరం కాదు.

ఆర్థిక విధానాలను పునఃసమీక్షించాలి

 ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ  సంక్షేమాన్ని అభివృద్ధికి చోదకశక్తిగా  మార్చినప్పుడే  తెలంగాణ సుస్థిర ఆర్థికశక్తిగా మారుతుంది.  పన్ను వసూళ్లలో  లీకేజీలను అరికట్టడం, ఆదాయాన్ని పారదర్శకంగా మార్చడం  వంటి చర్యలు అత్యవసరం.   వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి రుణాల  పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టాలి.  అప్పులు భవిష్యత్ తరాలపై  భారంగా  మారకూడదు. ఈ సూత్రాన్ని పాటిస్తేనే తెలంగాణ  ఆర్థికంగా అజేయమైన శక్తిగా  ఎదుగుతుంది.  ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను పునఃసమీక్షించుకుని ఉత్పాదకరంగాలపై పెట్టుబడులు పెంచినప్పుడే ఈ భారీ బడ్జెట్ లక్ష్యాలు నెరవేరుతాయి.  అప్పుల భారాన్ని తగ్గిస్తూనే  ప్రజా సంక్షేమాన్ని కాపాడటం అనేది కత్తి మీద సాము వంటిది.  దీనిని  అధిగమించేందుకు  పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక, రాజకీయ చిత్తశుద్ధి అవసరం. అప్పుడే  తెలంగాణ రాష్ట్రం దేశంలోనే  ఆదర్శవంతమైన ఆర్థిక నమూనాగా నిలుస్తుంది.  భవిష్యత్తులో రాబోయే  ఆర్థిక సవాళ్లను  ముందే  పసిగట్టి  అప్రమత్తంగా వ్యవహరించడం పాలనా దక్షతకు నిదర్శనం.  ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే  బడ్జెట్  కేటాయింపులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా  క్షేత్రస్థాయిలో  మార్పు తీసుకురావాలి.  అప్పుడే ఈ అంకెల ప్రయాణం అర్థవంతంగా ముగుస్తుంది. 

పారిశ్రామిక క్రౌడింగ్ అవుట్ 

ప్రభుత్వమే భారీగా రుణ సేకరణకు  పూనుకోవడం వల్ల  ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉండే నిధులు తగ్గుతాయి.  ఈ పరిస్థితిని ఆర్థిక పరిభాషలో  క్రౌడింగ్ అవుట్ అంటారు.  ఇది వడ్డీ రేట్ల  పెరుగు దలకు దారితీసి పారిశ్రామిక వృద్ధిని  కుంటుపరుస్తుంది. తద్వారా ఉపాధి అవకాశాలు తగ్గి దీర్ఘకాలం లో పన్ను రాబడి పడిపోయే  ప్రమాదం ఉంది.  సంక్షేమ పథకాలు పేదరిక నిర్మూలనకు  తోడ్పడాలి.  కానీ,  అవి పారిశ్రామిక పెట్టుబడులను అడ్డుకునే స్థాయికి చేరకూడదు.   తెలంగాణ వంటి రాష్ట్రాల్లో  పరిమితమైన పన్ను రాబడి ఉండి వ్యయం అధికంగా ఉండటం ఆర్థిక అస్థిరతకు మూలం.  లబ్ధిదారుల ఎంపికలో  హేతుబద్ధత  లేకపోవడం వల్ల  ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి.  

- డా. కట్కూరి
సైబర్ సెక్యూరిటీ 
న్యాయ నిపుణుడు