గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ... ఇవాళ్టి ( మే 25 ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూరి గుడిసెల వివరాల సేకరణ...

గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ... ఇవాళ్టి ( మే 25 ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూరి గుడిసెల వివరాల సేకరణ...
  • నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూరి గుడిసెల వివరాల సేకరణ
  • మహిళా సంఘాలకు బాధ్యత.. గుడిసె ఉంటే వెంటనే ఇల్లు మంజూరు
  • ఇందిరమ్మ ఇండ్ల రెండో దశలో ఇదే  ప్రాధాన్యత
  • సర్వేను టాప్ ప్రయారిటీగా తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుపేదలకు పక్కా గృహ వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అడుగు వేసింది.  ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉండగా, డబుల్ బెడ్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  సైతం మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందజేస్తోంది. ఇప్పుడు తెలంగాణను ‘పూరి గుడిసెలు లేని రాష్ట్రం’గా మార్చేందుకు సరికొత్త కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సోమవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సమగ్ర వివరాల సేకరణకు శ్రీకారం చుట్టనుంది. 

గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్ని పూరి గుడిసెలు ఉన్నాయి? వాటిలో నివసిస్తున్న అర్హులైన పేదలెవరు? అనే వివరాలను సేకరించి, వారికి తక్షణమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ​గ్రామాల్లో ఈ సర్వేను అత్యంత పారదర్శకంగా, క్షేత్రస్థాయిలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే బాధ్యతలను పూర్తిగా మహిళా స్వయం సహాయక సంఘాల ( ఎస్‌హెచ్‌జీ )కు అప్పగించింది.  

గ్రామంలో పేదలెవరు? పూరి గుడిసెలు ఎవరికి ఉన్నాయి? అర్హులు ఎవరు? అన్నది పూర్తి అవగాహన ఉన్న మహిళా సంఘాల ద్వారా వివరాలు సేకరిస్తే.. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  మహిళా సంఘాల ప్రతినిధులు ప్రతి గ్రామంలోని ప్రతి వీధిని జల్లెడ పట్టి పూరి గుడిసెల వివరాలను నమోదు చేయనున్నారు.

కలెక్టర్లకు ఆదేశాలు..

​ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ రెండో దశలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇండ్లను కేటాయించింది.  రెండో దశ  స్కీమ్‌ను వచ్చే నెల 1న అసిఫాబాద్  జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు.  2 వేల ఇండ్లతో  సంబంధం లేకుండా  పూరి గుడిసె  ఉన్న అర్హులైన పేదలకు వెంటనే ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  ఇందులో  పూరి గుడిసెల్లో నివసించే వారికే ప్రథమ ప్రాధాన్యత  ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. 

మహిళా సంఘాల సర్వే ఆధారంగా పూరి గుడిసె కలిగి ఉండి, నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సూచించింది.  పూరి గుడిసెలు ఉన్నవారి నుంచి అన్ని వివరాలు తీసుకొని గ్రామ పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఏఈఈలు 360 డిగ్రీ సర్వే నిర్వహించి  ఇండ్లను మంజూరు చేయనున్నారు. 

అర్హులైన పేదలకు ఇండ్ల మంజూరు ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని ప్రభుత్వం నొక్కిచెప్పింది. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తికాగానే కలెక్టర్లు తక్షణమే మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది. ఈ అంశంపై నియోజకవర్గ ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. 

అధికారుల అంచనా ఎంత?

​గతంలో నిర్వహించిన ‘ప్రజా పాలన’ దరఖాస్తుల సరళీకరణ ఆధారంగా రాష్ట్రంలో సుమారు 70 వేల వరకు పూరి గుడిసెలు ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావించారు. ఈ అప్లికేషన్లు తీసుకొని రెండేండ్లు అయింది. ప్రస్తుత వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య సుమారు 20 వేలలోపు ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

ఈ నేపథ్యంలోనే కచ్చితమైన లబ్ధిదారుల సంఖ్యను తేల్చేందుకు ఈ ప్రత్యేక సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మొత్తానికి, ఇందిరమ్మ ఇండ్ల రెండో దశ ద్వారా రాష్ట్రంలో గుడిసెల స్థానంలో పక్కా గృహాలను నిర్మించి, పేదల సొంతింటి కలను నూటికి నూరు శాతం నెరవేర్చాలనే పట్టుదలతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.అందుకు సంబంధించి కార్యాచరణను సిద్ధం చేసింది.