
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని కేబినెట్ నిర్ణయించింది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్నేతృత్వంలో ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
దాదాపు 16 నెలల పాటు విచారణ జరిపిన కాళేశ్వరం కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. ఈ క్రమంలో సోమవారం (ఆగస్ట్ 4) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై సుదీర్ఘంగా చర్చించింది మంత్రి మండలి. అనంతరం కాళేశ్వరం కమిషన్ నివేదికకు ఆమోద ముద్ర వేయడంతో పాటు ఈ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని కేబినెట్ నిర్ణయించింది.
కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. త్వరలోనే అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెడతామని చెప్పారు. ప్రజాప్రతినిధులకు కమిషన్ రిపోర్టు ఇస్తామని.. సభ్యులంతా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటామని.. అందరి ఆమోదం మేరకు ఈ విషయంలో తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామని అన్నారు.