ఆర్టీసీ ఏమైతదో!..విభజనా?లేక ప్రైవేటుకా?

ఆర్టీసీ ఏమైతదో!..విభజనా?లేక ప్రైవేటుకా?
  • సమ్మెపై నేడు చర్చించనున్న రాష్ట్ర కేబినెట్
  • తాత్కాలిక హామీలు ఇచ్చే చాన్స్​
  • మున్ముందు బాధ్యతల నుంచి తప్పించుకునే యత్నం
  • విలీనం మాటే లేదంటున్న అధికారులు

సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయనుంది? వారి డిమాండ్లను పరిష్కరించనుందా? పక్క రాష్ట్రం ఏపీలో మాదిరి మన దగ్గర కూడా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనుందా? ఇప్పుడు ఆర్టీసీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. సమ్మె మొదలు కావడానికి మరో నాలుగురోజులే మిగిలి ఉంది. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేతలు తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. దీక్షలు మొదలుపెట్టారు. ప్రభుత్వం దిగి రావాల్సిందేనని డిమాండ్​ చేస్తున్నారు. అయితే.. రాష్ట్ర సర్కార్​ దిగి వస్తుందా? అంటే.. అలాంటిదేమీ లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని ఓ సీనియర్​ ఐఏఎస్​ అధికారి చెప్పారు. మంగళవారం జరిగే కేబినెట్ భేటీలో సమ్మె విషయంపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలిపారు.  కార్మిక సంఘాల నాయకుల డిమాండ్లకు సీఎం తలొగ్గే అవకాశం లేదని ఆయన అన్నారు.

హైదరాబాద్, వెలుగుఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర అమోఘమని చెప్పిన టీఆర్ఎస్ పెద్దలు​.. ఇప్పుడు ఆ సంస్థ ను వదిలించుకునే మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు కొన్నాళ్లుగా ఆర్టీసీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. కేబినెట్​ భేటీలో తాత్కాలికంగా కార్మికులకు కొంత ఉపశమనం కలిగించే హామీలు ఇవ్వొచ్చేమో కానీ.. మున్ముందు మాత్రం ఆర్టీసీ బాధ్యతల నుంచి ప్రభుత్వం దూరం అవడం దాదాపు ఖాయమని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ముందు ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయని, అందులో ఒకటి ఆర్టీసీ విభజన, రెండోది సంస్థను ప్రైవేటు వారికి అప్పగించడం అని అంటున్నాయి.

ఆప్షన్​ 1: విభజన

ఆర్టీసీని కాపాడాలంటే ఆ సంస్థను విభజించక తప్పదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, కర్నాటకలో ఆర్టీసీని విభజించారని, ఇక్కడా అదే ఆలోచనలో సర్కార్​ ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితులను టీఆర్​ఎస్​ ప్రభుత్వం స్టడీ చేసి.. సంస్థను లాభాల బాటలోకి తేవడం కష్టమనే నిర్ణయానికి వచ్చిందని ఓ సీనియర్ అధికారి అన్నారు. సంస్థలో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్, హైదరాబాద్, కరీంనగర్ జోన్లు ఉన్నాయి. ఒకే యాజమాన్యం కింద ఈ మూడు జోన్లు పనిచేస్తున్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక డిపోలు నష్టాల్లో నడుస్తున్నాయని, కరీంనగర్ జోన్ లో నష్టాలు తక్కువగా వస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతమున్న మూడు జోన్లను రెండు సంస్థలుగా విభజించే మార్గం ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలిసింది. అంటే  గ్రేటర్ హైదరాబాద్ జోన్ ను  ఒక సంస్థగా, మిగిలిన తెలంగాణ జిల్లాలను కలిపి ఒక సంస్థగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలన్నీ కలిపి ఒక సంస్థగా చేస్తే పాలనపరమైన సమస్యలు వస్తాయనే మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అందుకని ఉమ్మడి మహబూబ్ నగర్, గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా ప్రాంతాలను కలిపి ఒక జోన్ గా చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు తెలిసింది.

ఆప్షన్​ 2: ప్రైవేటుకు..

ప్రస్తుతం ఉన్న సంస్థను విభజించినా ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సపోర్టు చేయాల్సి ఉంటుందని, లేకపోతే అప్పుడు కూడా ఇలాంటి ఫిర్యాదులే వస్తాయని అధికారవర్గాలు అంటున్నాయి. విభజన బదులు ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఎలాంటి సమస్య ఉండదనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్, కరీంనగర్   రీజియన్లను ఆఫర్​ చేస్తే తీసుకునేందుకు కొన్ని ప్రైవేటు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

విలీనం భారమవుతుందనీ..!

ఇతర రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల ఉద్యోగుల జీతాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. జీతాలు పెంచితే ఏడాదికి అదనంగా రూ. 1300 కోట్ల భారం పడుతుందని అంటున్నాయి. పైగా ఆర్టీసీ సంస్థ రూ. 3వేల కోట్ల అప్పులో ఉందని, ఏటా ఆ అప్పునకు రూ. 250 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని పేర్కొంటున్నాయి. ఏటా రూ. 800 కోట్ల నష్టాల్లో సంస్థ కొనసాగుతోందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 96  డిపోల్లో 9 మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయని వివరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తే మరింత భారంగా మారుతుందని, ఓ అధికారి తెలిపారు.

గతంలోనే హెచ్చరించిన సీఎం

గత ఏడాది జూన్​లో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమైనప్పుడు సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. సమ్మెలో పాల్గొంటే ఉద్యోగాలు ఊడిపోతాయని, ఉద్యోగాలు వద్దు అనుకునే వాళ్లు సమ్మెకు వెళ్లొచ్చని హెచ్చరించారు. ఒకవేళ సమ్మె చేస్తే ఆర్టీసీ సంస్థలో చివరి సమ్మె అవుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికీ సీఎం ఆలోచనలో ఎటువంటి మార్పు లేదని ప్రభుత్వంలోని ఓ సీనియర్ ఐఏఎస్  అధికారి చెప్పారు.

నష్టాలకు ప్రభుత్వమే కారణమంటున్న సంఘాలు

ఆర్టీసీ సంస్థ నష్టాలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు భాగస్వాములయ్యారు. వారు సమ్మెలో పాల్గొనడంతోనే సమ్మె విజయవంతమైందని నాడు టీఆర్ఎస్ అగ్రనేతలు గొప్పగా చెప్పారు. సకల జనుల సమ్మె జరిగిన ఏడాది ఆర్టీసీకి  రూ. 313 కోట్ల నష్టం వాటిల్లింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా సంస్థకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ఏటా గ్రాంట్లు, సబ్సిడీ, ఆర్థిక సాయం, ఐఆర్, ఉద్యోగుల లీవ్ ఎన్ క్యాష్ మెంట్ సొమ్ము ఆర్టీసీకి రావాలి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఐదేండ్లలో వివిధ రకాల రాయితీల కింద సుమారు రూ. 2822.75 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ కేవలం రూ. 639.29 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఏటా ప్రైవేటు సంస్థల మాదిరిగానే ఆర్టీసీ కూడా మోటర్ వెహికల్ టాక్స్ కడుతోందని, దాన్ని రద్దు చేయాలని చాలా కాలంగా కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వ నుంచి బకాయిలు విడుదల కాకపోవడంతో సంస్థ నష్టాలను ఎదుర్కొంటోందని వారు అంటున్నారు.

ఏపీ తరహాలో ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి. సంస్థకు ఉన్న అప్పులను మాఫీ చేయాలి. అప్పులకు కార్మికులను బాధ్యులను చేయొద్దు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ఉద్యోగ భద్రత కల్పించాలి. కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. సంస్థను బలోపేతం చేసేందుకు కొత్త బస్సులు కొనాలి. కొత్త సిబ్బందిని నియమించాలి.– అశ్వత్థామరెడ్డి,ఆర్టీసీ జేఏసీ కన్వీనర్

ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్​మెంట్​ పెంచినా సంస్థను లాభాల్లో నడిపించ లేకపోయారు. కొందరు స్వలాభం కోసం సమ్మె నోటీసు ఇచ్చారు. యూనియన్ నేతలు సంస్థను ముంచే ప్రయత్నం చేస్తున్నారు. సమ్మె చేస్తే ఉద్యోగాలు పోతాయ్. ఉద్యోగాలు వద్దనుకునేవాళ్లు  సమ్మెకు వెళ్లండి. సమ్మె చేస్తే ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుంది.- 2018 జూన్​​7న ఆర్టీసీ సమ్మె నోటీసుల సందర్భంగా సీఎం