
హైదరాబాద్ కూకట్ పల్లిలో సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు. స్వాన్ లేక్ అపార్టుమెంటులో ఇంట్లో పనిమనిషే ఓనర్ దారుణంగా చంపేసి పారిపోయిన ఘటనలో.. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శనివారం (సెప్టెంబర్ 13) హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు.
సెప్టెంబర్ 10న స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో రేణు అగర్వాల్ అనే మహిళను రోషన్, హర్ష అనే నిందితులు హత్య చేసినట్లు తెలిపారు. హర్ష కొద్ది రోజుల క్రితమే రేణు అగర్వాల్ ఇంట్లో పనికి కుదిరాడని,
రోషన్ అదే అపార్ట్ మెంటులో పై అంతస్తులో పని చేస్తాడని సీపీ చెప్పారు. ఇద్దరు జార్ఖండ్ రాంచీ కి చెందిన వారని.. 2023 లోనే రోషన్ పై మూడు కేసులు నమోదైనట్లు తెలిపారు.
రేణు అగర్వాల్ ఇంట్లో డబ్బులు, బంగారం ఉన్నాయని తెలుసుకున్న నిందితులు.. వాటిని కొట్టేసేందుకు చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నారు. రేణు కుమారుడు, భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే పదో తేదీన కుక్కర్ తో ఆమె తలపై మోదారు. ఆ తర్వాత ఆమె కాళ్లు చేతులు కట్టేసి ఇంట్లో ఆభరణాలు తీసుకుని వెళ్ళిపోయారు. 7 తులాల బంగారు ఆభరణాలు, పది వాచీ, రోల్డ్ గోల్డ్ వాచ్ లు దొంగతనం చేశారు. ఈ దోపిడీ కోసం సెప్టెంబర్ 8 వ తేదీ నుంచే ప్లాన్ చేసుకున్నారని సీపీ తెలిపారు.
రాంచీ ఓయో రూమ్ లో పట్టుకున్నాం:
మహిళను హత్య చేసి పారిపోయిన దుండగులను పట్టుకునేందుకు.. వెంటనే టీం లను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టామని సీపీ అన్నారు. నిందితులు ఇద్దరూ పరిచయస్తులని.. శుక్రవారం (సెప్టెంబర్ 12) రాత్రి ఇద్దరు రాంచీలో పట్టుబడ్డారని తెలిపారు. నిందితులలో హర్ష మత్తు పదార్థాలు సేవిస్తాడు.. గతంలో కోల్కతా రీహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స తీసుకున్నాడు.
ఈ కేసులో రోషన్ సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నాం. దోచుకున్న ఆభరణాలు దాచడానికి అతను సహాయ పడ్డాడని తెలిపారు సీపీ అవినాశ్.
క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన ఇన్ పుట్ ఆధారంగా ఛేజ్ చేశాం:
నిందితులు ఇద్దరు మర్డర్ అనంతరం హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ చేరుకున్నారని.. అక్కడ బైక్ వదిలేసి పారిపోయినట్లు తెలిపారు. అక్కడ క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా రాంచీ చేరుకున్నారని.. టీవీలో వస్తున్న వార్తలు చూసి క్యాబ్ డ్రైవర్ ఇన్పుట్ ఇచ్చాడని చెప్పారు. ఆ ఇన్ పుట్ కన్ఫర్మేషన్ అనంతరం రాంచీ వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
నిందితులు హఫీజ్ పేట్ నుంచి సికింద్రాబాద్ కు MMTS టికెట్లు తీసుకున్నారు.. స్టేషన్ లో పోలీసులను చూసి హఫీజ్ పేట్ నుండి బయటకు క్యాబ్ బుక్ చేసుకుని రాంచీ వెళ్లారు. రాత్రి ఒంటి గంటకు హఫీజ్ పేట్ నుండి క్యాబ్ లో బయలుదేరి ఉదయం తొమ్మిది గంటలకు రాంచీలో దిగారని తెలిపారు.