
తిరుపతిలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించారు. తమపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని స్థానికుల ఇళ్లపై దాడి చేశారు గంజాయి బ్యాచ్. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంలో జరిగింది ఈ ఘటన. శుక్రవారం ( సెప్టెంబర్ 12 ) జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
గత రెండురోజుల క్రితం రాత్రి సమయంలో ముగ్గురు మైనర్లు గంజాయి కొడుతుండగా.. పట్టుకొని దేహశుద్ది చేశారు స్థానికులు. అనంతరం మైనర్లను పోలీసులకు అప్పగించారు స్థానికులు. మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. దీంతో స్థానికులపై ఆగ్రహం పెంచుకున్న మైనర్లు మరో 15 మంది స్నేహితులను వెంటబెట్టుకొని ప్రతీకార దాడికి దిగారు.
తమపై దాడి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికుల ఇళ్లపై మూకుమ్మడిగా దాడికి దిగారు మైనర్లు. రాత్రి వేళ రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి ఇళ్లను ధ్వంసం చేశారు మైనర్లు. ఈ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు.ఏపీ టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో గంజాయి కల్చర్ పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.