మయన్మార్ రఖైన్ రాష్ట్రంలో రెండు స్కూళ్లపై వైమానిక దాడులు జరిగాయి. స్కూళ్లపై దాదాపు 500 పౌండ్ల బంబాలు వేయటంతో కనీసం 19 మంది హైస్కూల్ విద్యార్థులు మరణించినట్లు ఏఎఫ్పీ వార్తా సంస్థ నివేదించింది. దీనికి తోడు ఈ దాడుల్లో మరో 22 మంది గాయపడినట్లు అరకాన్ ఆర్మీ శనివారం ప్రకటించింది. వాస్తవానికి ఈ సంఘటన శుక్రవారం అర్థరాత్రి సమయంలో క్యౌక్తావ్ టౌన్‌షిప్‌లో జరిగింది. మయన్మార్ సైన్యం అరకాన్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో ఈ దుర్ఘటన నమోదైంది.
రెండు ప్రైవేటు ఉన్నత పాఠశాలలపై బాంబులు పడటంతో విద్యార్థులు మరణించారు. సైన్యం చేసిన పని వల్ల అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు అరకాన్ ఆర్మీ చెబుతోంది. వాస్తవానికి అరకాన్ ఆర్మీ ఒక సాయుధ సమూహం. అయితే ఈ దాడి విద్యార్థులు నిద్రపోతున్న సమయంలో జరిగిందని వెల్లడైంది. దీనిని యూనిసెఫ్ ఖండిస్తూ క్రూరమైన దాడిగా అభివర్ణించింది. రఖైన్ ప్రాంతంలో జరుగుతున్న హింస కారణంగా పిల్లలు, మహిళలు బలవుతున్నారని ఐక్యరాజ్యసమితి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
ALSO READ : పాక్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..
గత ఏడాది కాలంగా అరకాన్ ఆర్మీ భారీ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న రఖైన్‌లో జరిగిన వరుస సైనిక కార్యకలాపాల్లో ఇది తాజాది. 2021లో ఆంగ్ సాన్ సూకీ ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దెదించిన సైనిక తిరుగుబాటు నుంచి మయన్మార్ రాజకీయ, సాయుధ సంక్షోభంలో ఉంది. ఈ ప్రాంతంలో నెట్, ఫోన్ సౌకర్యాలు తక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
