
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో పట్టపగలే దారి దోపిడీ కలకలం రేపింది. ఓ స్టీల్ వ్యాపారిని బెదిరించి రూ. 40 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు దుండగులు. పారిపోతుండగా కారు బోల్తాపడింది. దీంతో అందినకాడికి తీసుకుని కొంత నగదును కారును అక్కడే వదిలి వెళ్లి పారిపోయారు కేటుగాళ్లు.
అసలేం జరిగిందంటే.? ఓ స్టీల్ వ్యాపారి రూ. 40 లక్షల నగదు తీసుకుని కారులో వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు బయల్దేరాడు. ముందు ప్రయాణిస్తున్న కారును స్విఫ్ట్ డిజర్ తో ఢీ కొట్టారు కొందరు దుండగులు. రాళ్లతో కారు అద్దం పగలకొట్టి వ్యాపారి కళ్ళలో కారం కొట్టి బొమ్మ తుపాకీతో బెదిరించి నలభై లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. చోరీ చేసిన తర్వాత తమ కారులో పారిపోతుండగా శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో దుండగుల కారు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో అందిన కాడికి తీసుకుని.. కారుతో పాటు కొంత డబ్బును అక్కడే వదిలేసి పారిపోయారు దుండగులు.
►ALSO READ | మేం ఎవరిపైనా పెత్తనం చెలాయించట్లే.. మాకు అందరికి బాస్ అతనే: హైడ్రా కమిషనర్ రంగనాథ్
స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారుదగ్గర బొమ్మ తుపాకీతో పాటు కత్తి,కారం పొడి, నగదును స్వాధీనం చేసుకున్నారు. కారు నంబర్ ఆధారంగా..సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు ఎవరు..ఎందుకు దోపిడి చేశారనే వివరాలను ఆరాదీస్తున్నారు.