- తెలంగాణ గిగ్ వర్కర్ల బిల్లు-2026కు కేబినెట్ పచ్చజెండా
- పేరెంటల్ సపోర్ట్, అడ్వకేట్ ప్రొటెక్షన్, హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లులకూ ఆమోదం
- రోహిత్ వేముల చట్టం విధివిధానాల కోసం భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం,
- ఈ సెషన్లోనే బిల్లులన్నింటికీ ఆమోదం తెలపాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గం సోమవారం నాలుగు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ -2026, తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్, తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్, అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు ఉన్నాయి. గిగ్ కార్మికులకు సామాజిక భద్రత, విద్వేష ప్రసంగాల కట్టడి, కన్నవారిని విస్మరించే ఉద్యోగుల వేతనాల్లో కోతతో పాటు విద్యాలయాల్లో కుల వివక్ష అంతానికి రోహిత్ వేముల చట్టం విధివిధానాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన భేటీలో వివిధ బిల్లులు, అంశాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లులన్నింటినీ ఈ అసెంబ్లీ సెషన్స్‌లోనే ప్రవేశపెట్టి.. చట్ట సభల ఆమోదం తీసుకోవాలని కేబినేట్నిర్ణయించింది.
4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్కు రక్షణ..
రాష్ట్రంలోని 4.2 లక్షల మంది గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ 2026’ బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీని ద్వారా కార్మికులకు చట్టబద్ధమైన గుర్తింపు, సంక్షేమ బోర్డు, నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్రం తెచ్చిన సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు తగ్గట్టుగా మార్పులు చేసిన ఈ బిల్లు.. గిగ్ వర్కర్ల హక్కులకు పూర్తి రక్షణ కల్పించనుంది. మరోవైపు సమాజంలో విద్వేషాలను రగిల్చే ప్రసంగాలను, సోషల్ మీడియాలో అల్లర్లను ప్రేరేపించే పోస్టులను కట్టడి చేసేందుకు ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు’ను తీసుకువచ్చారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలపై ఉక్కుపాదం మోపుతూ కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూనే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై కఠినంగా వ్యవహరించాలని కేబినెట్ నిర్ణయించింది. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని పెంపొందించడమే ఈ చట్టాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కులగణనపై ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్
పరిశీలనకు కేబినెట్ సబ్ కమిటీ
సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం చేపట్టిన కులగణనపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించి, దాని పరిశీలన బాధ్యతను మంత్రివర్గ ఉప సంఘానికి అప్పగించింది. 50 రోజుల పాటు సాగిన ఈ సర్వే డేటాను విశ్లేషించి అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. విద్యాలయాల్లో కుల వివక్షను పూర్తిగా రూపుమాపేందుకు ఉద్దేశించిన 'రోహిత్ వేముల చట్టం' విధివిధానాల రూపకల్పన కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉండి యూనివర్సిటీల్లో విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించేలా కసరత్తు చేయనున్నారు. అణగారినవర్గాల గౌరవం కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని కేబినెట్ స్పష్టం చేసింది. దేశంలోనే మొదటిసారిగా శాస్త్రీయంగా జరిగిన ఈ కుల గణన సర్వే రాష్ట్ర భవిష్యత్తును మార్చనుంది. యూనివర్సిటీల్లో వివక్ష లేని సమాజాన్ని నిర్మించేందుకు ఈ సబ్ కమిటీ కీలక పాత్ర పోషించనుంది.
వృద్ధులకు భరోసా..
‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్’ను ఆమోదించి.. వృద్ధులకు కేబినెట్ భరోసానిచ్చింది. వృద్ధాప్యంలో కన్నవారిని విస్మరించే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీతాల నుంచి 15 శాతం లేదా గరిష్టంగా రూ.10 వేలను కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు అందజేయనున్నారు. అలాగే, న్యాయవాదుల రక్షణ కోసం ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు’కు ఆమోదం తెలిపి.. వారికి వృత్తిపరమైన భద్రత కల్పించింది. గతంలో జరిగిన వామనరావు దంపతుల హత్య వంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిశ్చయించుకుంది. ఇక హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.15 వేల కోట్ల రుణభారాన్ని ప్రభుత్వం భరించి, ఈ వ్యవస్థను ప్రభుత్వపరంచేసే బాధ్యతను హైదరాబాద్‌మెట్రో రైల్లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్)కు నోడల్ ఏజెన్సీగా అప్పగించింది.
