
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న అధికార పార్టీ నేతలు కార్తీక మాసం వరకూ ఆగాల్సిందే. ఇప్పట్లో రాష్ట్ర కేబినెట్ విస్తరణ లేదని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 27 దాటితే మంచి రోజుల్లేవు. ఆ లోపు విస్తరణ సాధ్యం కాకపోవచ్చని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అక్టోబర్‌లో ఒకటి, రెండు ముహూర్తాలు ఉన్నా అవి అంత ప్రామాణికమైనవి కావని వేద పండితులు చెప్తున్నారు. నవంబర్‌లో కార్తీక శుద్ధ పంచమితోనే శుభ ముహూర్తాలు ఆరంభమవుతాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పట్లో కేబినెట్ విస్తరణకు అవకాశం లేకపోవడంతో నవంబర్ వరకు కీలకశాఖలన్నీ సీఎం వద్దే ఉండనున్నాయి. జులైలో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను కూడా కేసీఆరే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు ప్రారంభించాలని సీఎం ఇప్పటికే ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 27న కొత్త సచివాలయం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత మంచి ముహూర్తాల్లేవు. జులై 3న ఆషాఢమాసం మొదలై ఆగస్టు ఒకటితో ముగుస్తుంది. ఏటా శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉంటాయి. ఈ ఏడాది మాత్రం ఒక్క ముహూర్తం కూడా లేదని పండితులు చెప్తున్నారు. ఆగస్టు 2న మొదలయ్యే శ్రావణం అదే నెల 30తో ముగుస్తుంది. సెప్టెంబర్ నెల నాలుగో వారంలో పితృ అమావాస్య మొదలువుతుంది. దసరా తర్వాత ఒకటి, రెండు ముహూర్తాలు ఉన్నా, అవి అంత శ్రేష్టమైనవి కావని కొందరు పండితులు అంటున్నారు. ఈ ఏడాది కార్తీక మాసంలో శుభ ఘడియలు ఎక్కువగా ఉన్నాయని, అప్పుడే కేబినెట్ విస్తరణకు అవకాశముంటుందని అధికార పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
రాష్ట్ర కేబినెట్‌లో సీఎం సహా 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. కేబినెట్‌లో ఇంకా ఆరు ఖాళీలున్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో ఇద్దరు నుంచి ముగ్గురు మంత్రులపై వేటు పడవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదని పార్టీ అంతర్గత చర్చల్లోనే బలంగా వినిపిస్తోంది. కొత్తగా ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకోవడంతోపాటు ప్రస్తుత కేబినెట్ నుంచి తప్పించే వారి ప్లేస్‌లోనూ కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగినా, పరిషత్ ఎన్నికల కోడ్ ఉండటంతో అది కాస్త పక్కకుపోయింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టును శాస్త్రోక్తంగా ప్రారంభిస్తే వరద వచ్చిన వెంటనే నీళ్లను ఎత్తిపోయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే అన్ని పనులు పక్కనబెట్టి కాళేశ్వరం ప్రారంభ ఏర్పాట్లపైనే ఫోకస్ పెట్టింది.