మార్చి 12న తెలంగాణ కేబినెట్ భేటీ

మార్చి 12న తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 12వ తేదీన సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ కేబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. మళ్లీ ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. ఆరు గ్యారంటీల అమలుపై చర్చించనున్నారు. ఇప్పటికే ప్రారంభించిన కొన్ని గ్యారంటీలతో పాటు త్వరలోనే మహిళలకు రూ.2,500 ఇచ్చే మహాలక్ష్మీ గ్యారంటీపైనా చర్చించి.. మంత్రివర్గ ఆమోదం తీసుకోనున్నట్లు తెలిసింది. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకాలపై కేబినెట్​లో చర్చించి.. ఆమోదం తీసుకోనున్నారు. 

కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వేసిన ఎక్స్​పర్ట్ కమిటీ, మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్​ సిఫార్సుల మేరకు ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా కేబినేట్​లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రుణ మాఫీ, రైతు భరోసాపై కూడా చర్చించనున్నారు. వీటికితోడు విధానపరమైన మరికొన్ని అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. త్వరలో లోక్‌‌సభ ఎన్నికల కోడ్ రానుండడంతో ఈ లోపే ఆరు గ్యారంటీల్లో పెండింగ్‌‌లో ఉన్నవాటికి మంత్రివర్గం ఆమోదించేలా ముందుకు వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉన్నది.