మూడు కంపెనీలు.. 3 వేల 745 కోట్ల పెట్టుబడులు.. 15 వందల 18 మందికి ఉపాధి లభిస్తది: భట్టి విక్రమార్క

మూడు కంపెనీలు.. 3 వేల 745 కోట్ల పెట్టుబడులు.. 15 వందల 18 మందికి ఉపాధి లభిస్తది: భట్టి విక్రమార్క
  • ఇన్వెస్ట్​మెంట్లకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మూడు పెద్ద కంపెనీలకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కంపెనీల ద్వారా మొత్తం రూ.3,745 కోట్ల పెట్టుబడులు, 1,518 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. సెక్రటేరియెట్​లో మంగళవారం ఇండస్ట్రియల్ ప్రమోషన్ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ పరిశ్రమ ద్వారా రూ.2,398 కోట్ల పెట్టుబడితో 600 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

‘‘జేఎస్​డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్ కంపెనీ మహేశ్వరంలో కొత్త యూనిట్ ప్రారంభించనున్నది. రూ.785 కోట్ల పెట్టుబడితో 364 మందికి ఉపాధి లభించనున్నది. తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం కంపెనీ రూ.562 కోట్ల పెట్టుబడితో గ్యాస్ ఇన్సులేటివ్ స్విచ్ గేర్, బుషింగ్స్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది. దీని ద్వారా 554 మందికి ఉపాధి దొరుకుతది.’’అని భట్టి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో కంపెనీలు వస్తున్నాయని, దీంతో యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

‘‘పండ్లు సాగు చేసే రైతులకూ ప్రోత్సాహం అందిస్తున్నాయి. కోకాకోలా వంటి పరిశ్రమల ఏర్పాటుతో మామిడి, నారింజ వంటి పంటలకు డిమాండ్ పెరుగుతది. దీంతో రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడ్తది’’అని భట్టి అన్నారు. సమావేశంలో దావోస్ సహా వివిధ దేశాలతో కుదిరిన ఒప్పందాలు, వాటి అమలుపై కూడా సమీక్షించారు. ఈ మీటింగ్​లో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.