
- స్థానికత ఆధారంగా జోన్ల వారీగా బదిలీలు చేపట్టండి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిన జీవోలను రద్దు చేయాలని కేబినెట్ సబ్ కమిటీకి ఉద్యోగ, టీచర్ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగుల స్థానికత ఆధారంగా, జోన్ల వారీగా బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు విన్నవించాయి. గురువారం సెక్రటేరియెట్ లో 317 జీవో పై కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ సందర్భంగా మంత్రులు, కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, రెవెన్యూలో ట్రెసా, పీఆర్టీయూ, ఎస్టీఎఫ్, ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్లు, టీఎస్ పీఆర్టీయూ, టీఎస్ యూటీఎఫ్, తపస్, టీఎస్జీహెచ్ఎంఏ, బీసీటీఏ, ఎస్టీయూటీఎస్, ఇంటర్ విద్యాజేఏసీ, టీఎస్టీయూ, టీపీటీయూ, పీఆర్టీయూటీ, లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ తదితర సంఘాలు వేర్వేరుగా వినతిపత్రాలు అందించాయి. 317 జీవో పై తమ అభ్యంతరాలను వినతిపత్రం రూపంలో అందజేశారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను స్టడీ చేసి రిపోర్డులు రెడీ చేసి సీఎంకు సమర్పిస్తామని మంత్రులు తెలిపారు.
సానుకూల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మీటింగ్ లో టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, పీఆర్సీ చైర్మన్ శివశంకర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, సెక్రటేరియెట్ సర్వీసెస్ కార్యదర్శి నిర్మల, విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, న్యాయ శాఖ కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా 10 కొత్త జోన్లు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ అసోసియేషన్ తరుఫున ఫౌండర్ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి మంత్రులను కోరారు. ఉమ్మడి పది జిల్లాలను పది జోన్లుగా విభజించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు కోరారు.
వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలను ఒకే జిల్లాకు అలాట్ చేయాలని, ఒకవేళ ఖాళీలు లేకుంటే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు టీచర్లను బదిలీ చేయాలని, పరస్పర బదిలీలను అనుమతించాలన్నారు. కొన్ని జిల్లాల్లో 317 అమలుతో కేడర్ స్ట్రెంత్లోని టీచర్ పోస్టులన్నీ నిండిపోయాయని దీంతో, వారంతా ప్రమోషన్లు కోల్పోతున్నారని, అలాంటి జిల్లాల్లో సూపర్ న్యూమరీ పోస్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని, ఆ జీవో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదని యూటీఎఫ్ నేతలు చావా రవి, జంగయ్య తెలిపారు. జీవో 317 ను సవరించాలని, ఉద్యోగుల విభజనలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని చేసిన పోరాటాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.