నవంబర్ 12న కేబినెట్ మీటింగ్?

నవంబర్ 12న కేబినెట్ మీటింగ్?
  • స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే చాన్స్ 
  • ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలపై చర్చ  

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 12న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానున్నట్టు తెలిసింది. నిజానికి శుక్రవారమే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో వాయిదా వేశారు. గిగ్‌‌‌‌ వర్కర్ల సంక్షేమ ముసాయిదా బిల్లు, కొత్త డిస్కం ఏర్పాటుకు కేబినెట్‌‌‌‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదే విధంగా రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి అంశాలు కూడా మీటింగ్ అజెండాలో ఉన్నాయి.

 ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ విషయమై ప్రభుత్వం నుంచి హైకోర్టు స్పష్టత కోరగా, ఈ అం శంపై కేబినెట్‌‌‌‌లో చర్చించి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. జూబ్లీహిల్స్‌‌‌‌ ఉప ఎన్నిక పోలింగ్​నేపథ్యంలో11వ తేదీ తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలోనే తేలే అవకాశం ఉంది. 

అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా “ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలు” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్​ మొదటి వారంలో భారీ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విజయోత్సవాల నిర్వహణపైనా కేబినెట్‌‌‌‌లో చర్చ జరగనుంది. రెండేండ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి  తీసుకెళ్లడంపై చర్చించనున్నారు.